ఆధ్యాత్మిక మణిపూసలు;- మమత ఐల-కరీంనగర్-9247593432
గజేంద్ర మోక్షం (131 నుండి 140)
========================
ఏనాటి పుణ్యాలవి
ఎంత గొప్ప పిలుపులవి
కనీవినీ ఎరుగనట్టి
కళ్యాణపు ఘడియలవి

పేరులేదు ఊరు లేదు
కులము లేదు మతము లేదు
ప్రార్థించెను గాని గజము
ఎవరన్నది బోధపడదు

స్థలమన్నది లేనెలేదు
స్థానముకొక చోటు గాదు
కరి పులుపుల శక్తి జూడ
లింగ భేదంబు లేదు

ఎవరు వెళ్ళ సాధ్య పడును
ఇప్పుడేమి జేయ వలెను
అందరికాశ్చర్యంబే
చిక్కులోన ముంచెత్తెను

శ్రీ హరియని పిలువడు
శంభో యని తలవడు
కరి పిలుపుల గరిమ జూడ
త్రిమూర్తులని వేడడు

అమ్మా అని కొలవడు
ఎవరన్నది తెలుపడు
ఎవరుబోను వీలుగాదు
ప్రార్థించుట విడువడు

దైవాలెల్లరు లేసిరి
ఒకరినొకరు జూసుకొనిరి
నన్నుగాదు నన్నుగాదు
అనుకొని నిలబడిపోయిరి

కొసమెరుపుల ప్రాణముంది
ఎవరన్నది తెలియకుంది
పిలుపులోని దిగ్బంధం
కదలకుండ జేయుచుంది

దేవేంద్రుడి వాహనము
తన జాతైరావతము
తనవైపు జూసి రగిలెను
చేయగ వన విహారము

సాయముకై వెళ్ళలేదు
కరి కోరిక మీరలేదు
క్షణమొక యుగమై గడిచే
తరుణంబును ఆపలేదు


కామెంట్‌లు