పిరికివానితో చేతులు కలపకు -డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఒకూర్లో ఒక రైతుండేటోడు. ఆయనకో పెండ్లాముండేది. ఆమె చానా తెలివైనది. వాళ్ళకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఒకసారి పండుగకని వాళ్ళు వాళ్ళ అత్తోళ్ళ వూరికి బైలుదేరినారు. అప్పట్లో ఇప్పట్లా రైళ్ళూ, బస్సులూ, రోడ్లు లేవు గదా... యాడికైనా సరే నడుచుకుంటానే పోవాలి. నడుచుకుంటానే రావాలి.
వాళ్ళు అట్లా పిల్లలతో పోతా వుంటే ఒక పెద్ద అడవి వచ్చింది. ఆ అడవి దాటగానే వాళ్ళ వూరు. వాళ్ళు అడవిలో సగం దూరం పోయినాక నడిచీ నడిచీ కాళ్ళు నొప్పి పెట్టి ఒక చెట్టు కింద కూలబన్నారు. పిల్లోళ్ళు వాళ్ళ నాయనతో “నాయనా... ఆకలితో అల్లాడి పోతావున్నాం. ఏవైనా పండ్లుగానీ, కాయలుగానీ వుంటే తీసుకోనిరా" అన్నారు. సరేనని వాళ్ళ నాయన పండ్ల కోసం చుట్టూ చూసినాడు. కానీ యాడా ఏమీ కనబళ్ళేదు. దాంతో "సరే... మీరిక్కడే హాయిగా కాసేపు కూచోండి. నేను పోయి ఈ చుట్టుపక్కల యాడైనా ఏమైనా దొరుకుతాయేమో చూసొస్తా" అని పోయినాడు.
ఆ అడవిలో ఒక పులి వుంది. అది చూడ్డానికి ఎత్తుగా, లావుగా, భయంకరంగా వుంటాది గానీ వుత్త పిరికిది. చిన్న చిన్న జంతువులను వేటాడ్డమే గానీ పెద్ద జంతువుల జోలికి అస్సలు వెళ్ళేది కాదు. ఆ రోజు దానికి పొద్దున్నుంచీ ఒక్క జంతువూ దొరకలేదు. ఆకలితో అల్లాడిపోతా ఆహారం కోసం వెదుక్కుంటా తిరుగుతా వుంటే చెట్టు కింద ఈమె ఇద్దరు చిన్న పిల్లలతో కనబడింది. దాంతో దానికి నోరూరింది. 'ఆమె ఏమైనా పక్కకి గానీ పోతే ఆ పిల్లల్లో ఎవర్నో ఒకర్ని ఎత్తుకొని పోయి కమ్మగా తినొచ్చుగదా' అని సంబరపడింది. మట్టసంగా చప్పుడు గాకుండా అడుగులో అడుగు వేసుకుంటా దగ్గరికి వచ్చి ఒక పొద వెనుక దాచి పెట్టుకోని నిక్కి నిక్కి చూడసాగింది.
ఆకులు వూకూకెనే కదులుతా వుంటే ఆమెకు అనుమానం వచ్చింది. లోపలేదో వుందని తల దించుకున్నట్లే దించుకోని మట్టసంగా గమనించసాగింది. ఇంకేముంది పెద్దపులి. తొంగి తొంగి చూస్తా వుంది. దాన్ని చూస్తానే ఆమె పై ప్రాణాలు పైన్నే పోయినాయి. భయంతో గుండె ధనధనా కొట్టుకోనింది. ఒళ్ళంతా చెమటలు పట్టినాయి. 'ఎట్లాగబ్బా దాన్నుంచి తప్పించుకోవడం' అని ఆలోచించసాగింది. 'కండ్ల ముందు ఆహారం కనబడతా వున్నా మీదికి దూకకుండా ఇట్లా తొంగి తొంగి చూస్తా వుందంటే ఇది చానా పిరికిదై వుండాలి' అనుకోనింది. దాంతో ఆమెకు ఛటుక్కున ఒక ఉపాయం తోచింది. వెంటనే చిన్న పిల్లోని వీపుపై గట్టిగా ఒక్క గిచ్చు గిచ్చింది. అంతే... వాడు వీపు సుర్రుమనే సరికి తట్టుకోలేక 'ఓ' అని అడవంతా అదిరిపోయేలా భయంకరంగా ఏడవడం మొదలు పెట్టినాడు.
అది చూసి ఆమె పైకి లేచి గట్టిగా పులికి వినబడేలా “ఏందిరా... ఎప్పుడు చూసినా వూకె ఆకలి ఆకలి అంటా అట్లా ఏడుస్తా వుంటావు. పొద్దున్నే గదా ఒక పెద్ద ఏనుగును పట్టుకోని కమ్మగా కూర చేసి పెట్టింది. అప్పుడే అరిగిపోయిందా... కొంచెమాగు... ఈ అడవిలో ఒక పెద్దపులి తిరుగుతా వుందంట. అది కనబడగానే కమ్మగా కోసి పెడతా” అనింది.
అంతే ఆ మాటలింటానే పెద్దపులి అదిరిపడింది. “ఓరినాయనోయ్... ఇది అందరిలాగా అట్లాంటిట్లాంటి మామూలు ఆడది కానట్లుంది. ఏ బ్రహ్మరాక్షసో, రక్తపిశాచో అయ్యుంటాది. దీనికి దొరికితే అంతే. ఈ రోజుతో భూమ్మీద నాకు నూకలు చెల్లిపోతాయ్" అనుకోని వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా కిందామీదా పడతా పారిపోసాగింది.
అదట్లా పురుకుతా వుంటే దారిలో ఒక నక్క చూసింది. అది దానికి అడ్డం పడి "ఏం మామా... అట్లా వురుకుతా వున్నావు. ఏమైంది" అనింది.
“అల్లుడూ...ఇది తీరిగ్గా కూచోని కబుర్లు చెప్పుకునే సమయం గాదు. వెనుక పెద్ద ఆపద ముంచుకొస్తా వుంది. పొరపాటున దానికి గనుక దొరికినానంటే అంతే, వుత్త పుణ్యానికే చచ్చిపోతాను" అనింది పురకడం ఆపకుండా.
నక్క గూడా పులి వెంబడే వురుకుతా “అదేంది మామా... అంత మాటంటావు. ఈ అడవిలో జంతువులన్నీ నువ్వు కలలో కనబన్నా చాలు ఎక్కడివక్కడ గుండె ఆగి చస్తాయి. అట్లాంటిది నువ్వు బెదపడి పారిపోవడమా... ఏం జరిగిందో చెప్పు" అని అడిగింది. అప్పుడు పులి గసబెడతానే జరిగిందంతా వివరించింది.
ఆ మాటలు విన్న నక్క "మామా. . నువ్వంటే ఏమనుకుంటా వున్నావు. ఈ అడవికి రాజువి. ఒక్కరుపు అరుస్తే చాలు ఏడేడు పద్నాలుగు లోకాలు గజగజా వణికిపోతాయి. అదెవతో గానీ నిన్ను మాటల్తో మాయ చేసి
బోల్తా కొట్టిచ్చినట్లుంది. పద... ఈసారి నేనూ వస్తా... చూసుకుందాం దాని కత" అనింది రెచ్చగొడతా.
ఆ మాటలకు పులి అట్లాగే వణుకుతా “చూడు అల్లుడూ నువ్వు ఎన్నయినా చెప్పు. తలకిందులు తపస్సు చేసినా నేను రాను. నీకేం తెలివైనదానివి. ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి ఏసి తప్పించుకునే రకం. ఏమైనా చెబుతావు. ఎన్నయినా చేస్తావు. చచ్చేది నేను గానీ నువ్వు కాదు గదా" అనింది.
దాంతో నక్క “మరీ అంత భయమైతే ఎట్లా మామా... నిన్నొదిలి నేనెక్కడికీ పారిపోనులే. ఒక పని చేద్దాం. నా కాలికి నీ కాలికి పూడిపోకుండా గట్టిగా ఒక తాడు కట్టుకుందాం. చావైనా బ్రతుకైనా కలిసే పోదాం... సరేనా" అనింది.
దాంతో పులి చివరకు 'సరే' అనింది. నక్క ఒక తాడు తెచ్చింది. పులి దాంతో తన కాలికి, నక్క కాలికి ఎంత లాగినా వూడిపోకుండా గట్టిగా కట్టు కట్టింది. రెండూ కలిసి మళ్ళా నెమ్మదిగా అడవిలోనికి పోసాగినాయి.
ఆడ ఆమె అడవిలో 'పండ్లు తెస్తానని పోయిన మొగుడు ఎప్పుడెప్పుడు వస్తాడా... ఈ చోటు వదిలేసి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా' అని ఎదురుచూడసాగింది. ఆమె “పులి గానీ మళ్ళా వస్తాదో ఏమో' అనుకోని చెట్టు ఎక్కి అప్పుడప్పుడు చుట్టూ గమనిస్తా వుంది. అంతలో ఆమెకు దూరంగా పులి, నక్కా ఒకదానికొకటి తాడు కట్టుకోని కలసి రావడం కనబడింది. అవి అట్లా తాడు కట్టుకోని రావడం చూసి “ఓహో... ఈ నక్క దాన్ని మళ్ళా పిల్చుకొని వస్తా వున్నట్లుంది. రానీ రానీ దగ్గరికి" అనుకోనింది.
పులీ నక్కా మట్టసంగా దాచి పెట్టుకుంటా, దాచిపెట్టుకుంటా ఆ చెట్టు దగ్గరికి వచ్చినాయి. అవి అట్లా దగ్గరికి రాగానే ఆమె ఈసారి ఇద్దరు పిల్లల వీపుల మీద గట్టిగా ఒక్క గిచ్చు గిచ్చింది. అంతే... వాళ్ళు ఓ అంటా అటు ఆరు పూర్లు, ఇటు ఆరు వూర్లు అదిరిపడేలా గట్టిగా ఏడుపు అందుకున్నారు. ఆ ఏడుపు వింటానే ఆమె “అరే... ఎన్ని సార్లు చెప్పాలి మీకు... ఏదో ఒక పులో సింహమో దొరికితే కోసి పెడతానని. కాసేపు గమ్మునుండండి. ఇక్కడెక్కడో దగ్గర్లోనే ఒక పులీ, నక్కా వున్నట్లున్నాయి. వాసన కమ్మగా వస్తా వుంది. వుండండి పట్టుకోనొస్తా" అంటా పైకి లేచింది, జుట్టు విరబోసుకోని, ముక్కు ఎగబీలుస్తా.
అంతే... ఆ మాట వింటూనే పులి "నే చెప్పలా... అది మామూలు ఆడది గాదు. మనిషి రూపంలోనున్న బ్రహ్మరాక్షసి అని, దొరికినామనుకో నిన్నూ, నన్నూ కలిపి చంపి, కమ్మగా కలిపి వండి పిల్లలకు పెడతాది" అంటా సర్రున వెనక్కి తిరిగింది. నక్క “వుండు వుండు... అదంతా అబద్దాలు చెబుతోంది. అది నీవనుకున్నట్లు రాక్షసి గాదు మనిషే" అంటా గట్టిగా అరుస్తా వున్నా వినకుండా పులి చించుకోని వురకసాగింది. దాని కాలు నక్క కాలుకి గట్టిగా కట్టి వుంది గదా... దాంతో అది గూడా పులి వెంబడే కిందా మీదా పడతా వురకసాగింది. కానీ నక్క పులంత వేగంగా వురకలేదు గదా... దాంతో కిందబడిపోయింది.
అయినా పులి ఒక్కక్షణం గూడా ఆగలేదు. అట్లాగే నక్కను ముళ్ళకంపలల్లో, బండరాళ్ళల్లో ఈడ్చుకుంటా వురకసాగింది. దాంతో దానికి రాళ్ళు తగిలీ, ముళ్ళు గుచ్చుకోని ముక్కూ మొగం పగిలి వాచిపోయినాయి. దాంతో అది ముక్కుతా మూల్గుతా "ఎవరితోనైనా పోవచ్చుగానీ పిరికోనితో మాత్రం కలసి పోగూడదు. అట్లా పోతే చివరికి మన కొంపే మునుగుతాది అంటారు పెద్దలు. అది నిజమే" అనుకోనింది కళ్ళనీళ్ళతో.
***************************
కామెంట్‌లు