"ఓం నమఃశివాయ" తారక మహా మంత్రము!;- "కవి మిత్ర" శంకర ప్రియ., శీల.,-సంచార వాణి: 99127 67098
🔱 "ఓం"కార మను వర్ణము
 సూక్ష్మ మైన పంచాక్షరి
తారక మహా మంత్రము!
      ఓ శంకర ప్రియులార!
🔱 "నమశ్శివాయ" యనెడు
 స్థూల మైన పంచాక్షరి!
తారక మహా మంత్రము!
        ఓ శంకర ప్రియులార!
   ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
   
🔱"ఓం"కారమే ప్రణవాక్షరి! ఇందులో.. "అ"కారము.. "ఉ"కారము .. మకారము.. బిందువు.. నాదము.. అనెడు; అవ్యక్తములైన అయిదక్షరములు కలిగియున్నది. కనుక, సూక్ష్మ పంచాక్షరి! ఇదియే.. తారక మహామంత్రము!
 🔆"న మ శ్శి వా య".. శ్రీశివ పంచాక్షరి! ఇందులో.. వ్యక్తములైన అయిదక్షరములతో.. పరమేశ్వర తత్త్వము పేర్కొనబడు చున్నది! కనుక, స్థూల పంచాక్షరి! ఇదియే తారక మహా మంత్రము!
🔆ప్రణవ సహిత, శ్రీ శివ పంచాక్షరి మంత్రము.. సప్తకోటి మహా మంత్రములకు మూలమైనది! ఇది..
 ఆగమాలు, నిగమాలలో .. శ్రేష్ఠమైనది! అయిదు అక్షరాలతో కూడిన, శబ్ద పరంబ్రహ్మ స్వరూపము! పంచముఖుడైన సాంబ శివుని తేజోరూపాన్ని, ఆరాధకుల హృదయాకాశము లందు సాక్షాత్కారము కావించు చున్నది!
🔆శ్రీ శివ పంచాక్షరి.. ఉపనిషత్తులను గాఢంగా మధించగా, ఆవిర్భావమైన సుస్వరము! ఇది.. అపారమైన పుణ్యాన్ని పొందడానికి సాయంచేసే రత్నాభరణం వంటిది! ఇది.. సాధకులందరికీ, తమ తపస్సాధనా పుణ్య ఫలమును అనుగ్రహించు చున్నది! అట్లే, అందరిలో.. "హితభావన" పెంపొందించు చున్నది!.. 
 🔱"ఓం నమశ్శివాయ"... శ్రీ శివ పంచాక్షరి మంత్రమే.. భవ తారక మంత్రము!

      🚩 సీస పద్యము 🚩
వేదాలు బోధించు విధులలో శ్రేష్ఠమౌ
     మంత్రమ్ము శివము! "నమశ్శివాయ"!
పంచముఖుండగు భవుని పంచాక్షరీ
       మంత్రమ్ము శుభము! "నమశ్శివాయ"!
ఉపనిషత్తులనుండి ఉద్భవించిన ఘన
     మంత్రమ్ము వరము! "నమశ్శివాయ"!
పుణ్యఫలమ్ముల పొంద సాయము చేయు
     మంత్రమ్ము జయము! "నమశ్శివాయ"!
        🚩 తేట గీతి పద్యము 
రక్తి జపియింపగ భవ తారకమగుచును
    భక్తులకు హితభావన యుక్తమనుచు
తెలిపి "ఓం"కార యుక్తమై వెలుగునట్టి
    మంత్ర మిదియె నిజమ్ము! "నమశ్శివాయ"!
     ( రచన: అవధాని, కోట రాజశేఖర్.,)

కామెంట్‌లు
Good and necessary message చెప్పారు…
Good and nessery message