నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు

 దింపుడు కల్లం
-------------------
     ఇది ఒక హిందూ ఆచారానికి  సంబంధించిన నానుడి.  పని జరగదని పూర్తిగా తెలిసిన ఏదో ఒక మూల జరుగుతుంది అనే చిన్న ఆశను దింపుడు కల్లం ఆశ గా చెబుతాము. ఇది చనిపోయిన మనిషి తిరిగి బ్రతుకుతాడు అనే ఆశకు సంబంధించింది. ఇప్పుడు కూడా ఎవరైనా చనిపోతే శవ యాత్రలో ఓ చోట ఆపి శవాన్ని దించి బంధువులు  శవం చెవిలో లేవమని చెబుతూ వుంటారు. ఆ శవాన్ని  దింపిన చోటునే దింపుడు కల్లం అంటారు.  ఆ ప్రాంతంలో పిలిస్తే బ్రతుకుతాడని అతడి ప్రీతి పాత్రుల ఆశ.  మరి ఈ దింపుడు కల్లం ఆశ ఎలా కలిగిందో?, ఈ ఆచారం ఎలా వచ్చిందో? చూద్దాం.
     పూర్వం తులసీదాసు అనే హిందీ కవి కాశీలో ఉండేవాడు. ఆయన గొప్ప రామ భక్తుడు. రామచరిత మానస్ అనే గొప్ప కావ్యం కూడా ఆయన రాశాడు. ఆయన వద్ద చాలా మహిమలు ఉన్నాయని చెబుతారు. ఒకరోజు తులసి దాస్ ను ఓ ఆడ పెళ్ళివారు పెళ్ళివేడుకకు పిలిచారు. వివాహం అనంతరం నూతన  వధువును "దీర్ఘ సుమంగలి భవా" అని ఆశీర్వదించాడు తులసి. వారం రోజుల అనంతరం పనిపై బయటకు వెళ్లిన వధువు భర్తను నాగు పాము కరిచింది. అతడు అక్కడికక్కడే మరణించాడు. 
       అతడి శవాన్ని డప్పు వాయిద్యాలతో  స్మశానానికి తీసుకు వెళుతున్నారు. పాడే వెనుక రోదిస్తూ అతడి కాళ్లకు పారాణి ఆరని అతని భార్య కూడా వుంది. శవ యాత్ర తులసీదాసు ఆశ్రమం వద్దకు వచ్చింది. లోపల ఉన్న తులసి అక్కడికి వచ్చాడు. తులసి రాగానే పాడెను దించారు. భార్య గట్టిగా ఏడ్వసాగింది. దీర్ఘ సుమంగలిగా ఉండమని ఆశీర్వదించినట్టు ఆయనకు గుర్తుకు వచ్చింది. వెంటనే పాడే ప్రక్కన కూర్చొని  శవం చెవిలో ఏదో మంత్రం జపించాడు. తక్షణం అతడు దిగ్గునా లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యంగా అటూ ఇటూ చూడసాగాడు. 
      ఇదీ కథ. అప్పటి నుండి శవ యాత్రలో  ఓ చోట పాడెను దింపి  ఇష్ట ప్రియులు వచ్చి శవం చెవిలో  లేవమని చెప్పే ఆచారం అమలులోకి వచ్చింది. ఇక ఈ దింపుడు కల్లం ఆశ నానుడి కూడా ఏర్పడింది.  ఒక సంఘటన ద్వారా వచ్చిన ఈ నానుడిని ఒక్క శవం కే కాకుండా ప్రతి విషయంలోనూ, చిగురంత ఆశ అనే అర్ధంతో  ఉపయోగిస్తారు.
కామెంట్‌లు