కవనకుసుమాలు- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
చారడేసి కళ్ళతో
కలువలు
కట్టిపడేస్తున్నాయి

రకరకాల రంగుల్లో
వివిధవిరులు
వెలిగిపోతున్నాయి

వింతవింత రెక్కలతో
సీతాకోకచిలుకలు
ఎగురుతున్నాయి

పచ్చని మైదానంలో
తలలెత్తినగడ్డిపూలు
ప్రేమగాపలుకరిస్తున్నాయి

సువాసనలు వెదజల్లుతూ
మరుమల్లియలు
మత్తెక్కిస్తున్నాయి

కొమ్మలనిండా పూలతో
పచ్చనిచెట్లు
పరవశపరుస్తున్నాయి

గాలికి కదులుతూ
విచ్చుకున్నవిరులు
వేడుకచేస్తున్నాయి

తళతళా తలలో 
తలుపులు
ప్రకాశిస్తున్నాయి

బిరబిరా పుటల్లో
అక్షరకుసుమాలు
పరుగులుతీస్తున్నాయి

ధగధగా కవనలోకంలో
కమ్మనికవితలు
కాంతులుచిమ్ముతున్నాయి

చూచి పోల్చుకో 
ఆకాశంలోని చుక్కలను
తోటలలోని పువ్వులను
పుటలలోని కవితలను


కామెంట్‌లు