సుప్రభాత ; కవిత - బృంద
పసిడి వెలుగురేఖలు
ప్రసరింపగ నలుదెసల
అరుణవర్ణపు సుమములు
అతిశయముగ మెరిసెనెందుకో?

తటాలున తొంగిచూసి
తమ సొగసుకు ముచ్చటపడి
తామే మురిసిపోయి
తళతళమని  మెరయుచున్నందుకేమో!

కెంపువర్ణము ఒడినింపుకుని 
పూల సొంపులన్ని చూచి 
ఇంపుగ గలగలమని 
వంపులతో సాగె  సెలయేరు

పసిడి కళలొలుకు ప్రభాకరుని
ప్రతిబింబము తనలో దాచి
పరవశించి కరిగి నీరై
ప్రవహించెను అనురాగ ధారయై!

అరుణోదయ తరుణాన
తూరుపు తనలోని ఎరుపును
విరిబాలలకు అరువిచ్చి
సిరివన్నెల వరమిచ్చి దీవించెనేమో!

పొద్దెక్కగా బాలుడు
పొగడపూవు ఛాయలో
గగనాన తన తేరును
ఆగమేఘాల పరుగు తీయించెనేమో!

సిరివెన్నెలంటి చిరు వెలుగులు
కురిపించు చల్లని వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు