వాడొక పాలబుగ్గల పోరగాడు
వాడొక అనామక
గర్భశుక్తి ముక్తాఫలం
వాడు ఎవరికీ చెందడు
వాడంటే ఎవరికీ పట్టదు
వాడు చెత్తమీదనే ప్రభవించిండు
వాడు చెత్తమీదనే పెరిగిండు
చెత్తనే వాడికి జీవనాధారం
చెత్తనే వాడికి ప్రాణాధారం
సూర్యుడితో పోటీపడి డ్యూటీచేసి
చెమటచుక్కై
భుజమ్మీది సంచీలోకి జారుతడు
బతుకు పోరాటంలో
చెత్తతోటే తలపడుతడు
నిబిడాంధకార జనారణ్యంలో
వాడి కళ్ళే టార్చిలైట్లు
రాయి, రప్ప, చెట్టు, చేమ కాదు
సందులూ,గొందులూ,చౌరస్తాలూ
పక్షిలా తిరుగుతడు
వాడికి సంతోషాల ఉషస్సులు లేవు
వాడికి ఆనందాల ఇంద్రధనుస్సులు లేవు
వాడిది దినదినగండం నూరేళ్ళాయిష్షు
పాపం!
వాడొక పాలబుగ్గల పోరగాడు!!
*********************************
పాలబుగ్గల పోరగాడు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి