సుప్రభాత కవిత ; - బృంద
తూరుపు వైపు సుదూరతీరాన
గిరుల శ్రేణికి ఆవల వైపున
ప్రభవించు జ్యోతికలశం
ఒలికించే కాంతి పుంజం...

గగనాన వెలిగే తారాదీపంలా
భువనాన కురిసే కాంతిధారలా
అవనికి  దిగివచ్చు దీపశిఖలా
జగతిని మేల్కొలిపే  వెలుగులు

వేయిదీపాలు కళ్ళలో  వెలిగించి
కోటి కోరికలు గుండెలో పొంగించి
వ్యధలన్నీ తొలగించు తొలకరిలా
గుండెకు వచ్చిన పండుగలా..

గుట్టుగ దాచిన పరిమళాల
పట్టు సడలిన పరవశాలై
చుట్టు ముట్టే కొండగాలుల
చెట్టు చేమలు కదిలిపాడ

కనకవృష్టిగ కురిసే కిరణాలు
మనసు నింపగ మైమరచి
తనువు ఊయల ఊగినట్టు
కనుల విందుగ తోచే వనము

వరముగ దొరికే వేకువకు
కరములు జోడించి జోతగా
కరుణను కురిపింప వేడుతూ
అరుణోదయాన అంతరంగం పాడే

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు