సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -263
వృశ్చిక విదూషక న్యాయము 🤡
*************
వృశ్చికము అంటే తేలు. విదూషకుడు అంటే హాస్యగాడు.
హాస్యగాడుగా నటించే నటుడికి నటించేటప్పుడు ఒక వేళ తేలు కుట్టి బాధ పడుతున్నా అది కూడా హాస్యమే,నటనలోని భాగమే అనుకుంటారు.
 కానీ నిజమైన అతని బాధను ప్రేక్షకులు ఎవరూ అర్థం చేసుకోరు.అలాగే నటించే వ్యక్తి కూడా తన బాధని హాస్య నటన వెనుక దాచుకుంటాడు. కారణం  అక్కడ వ్యక్తం చేసే పరిస్థితి లేకపోవడం అని కూడా చెప్పవచ్చు.
అయితే అదెంత బాధాకరమైన పరిస్థితినో అనుభవించే ఆ నటుడికి మాత్రమే తెలుస్తుంది.
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా వుండే వ్యక్తులకు తేలు కాటు లాంటి బాధాకరమైన సంఘటనలు ఎదురైనప్పుడు వారి మానసిక స్థితి,ఎదుటి వారి దృష్టి ఎలా ఉంటుందో చెప్పడమే ఈ న్యాయములోని ప్రధాన ఉద్దేశ్యం.
వాళ్ళు తమ కష్టాలను బాధలను ఎవరితో పంచుకోలేరు. పంచుకోవాలని అనుకున్నా,పంచుకున్నా నమ్మే స్థితిలో ఎదుటి వారు వుండరు.
ముఖ్యంగా సినీ  ఇది కేవలం హాస్య నటుల విషయంలోనే కాదు ఇతర నటులు, ప్రముఖుల జీవితాల్లో కూడా ఇలాంటి  అనుభవాలు  కోకొల్లలుగా ఉంటాయి.
కొంతమంది వ్యక్తులు ఎంచుకున్న రంగంలో  తాము వెళ్ళే దారి ముళ్ళబాట అని తెలిసినా ధైర్యంగా ముందుకు సాగిపోతూ వుంటారు.అందులోని కష్టాలను, కన్నీళ్ళను బయటికి కనబడనీయకుండా చాలా జాగ్రత్త పడుతూ పెదవులపై చిరునవ్వు చెరగనీయకుండా ఉండేందుకు అనుక్షణం తాపత్రయ పడుతుంటారు.
భారత దేశపు ఉక్కు మనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంలో జరిగిన ఈ సంఘటన చూద్దాం.
పటేల్ గారు కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్న సమయంలో భార్య మరణించిన వార్త ఓ పేపర్ లో రాసి అందిస్తారు. అది చూసి తనలోని భావోద్వేగాలను  పైకి వ్యక్తం చేయకుండా, ఆ పేపరును మడిచి జేబులో పెట్టుకొని కేసును యథావిధిగా వాదిస్తారు.ఆ తర్వాత అందులోని భార్య మరణ వార్తను ఇతరులకు తెలియజేస్తారు.అంతగా చలింపజేసే సంఘటనలో కూడా అలా ఉండటం వల్లభ భాయి గారికే చెల్లిందని అందరూ అనుకున్నారు.
అలా చేయకపోతే కేసు మధ్యలో ఆగిపోతుంది.దాని ఫలితాలు ఎలా ఉంటాయో తెలియవు. అందుకే అలాంటి వాళ్ళు లోపల ఎంత బాధ వున్నా పైకి కనబడనీయరు.
ఇక పిల్లలు ఆడుకునే సమయంలో కూడా ఇలాంటివి జరగడం చూస్తుంటాం. ఆటల్లో ఒకోసారి పడిపోతూ వుంటారు.అది చూసి మిగతా పిల్లలంతా నవ్వుతూ వుంటారు. అది ఆటలోని భాగంగానే భావిస్తారు కానీ పడ్డవానికి  తగిలిన దెబ్బల బాధను అర్థం చేసుకోరు.పడిపోయిన వాడు గట్టిగా ఏడ్వలేక నవ్వు మొహంతో,ఏమీ తగల లేదు అన్నట్లు ఉండటం గమనించవచ్చు.
 ఈ "వృశ్చిక విదూషక న్యాయము"ను నిశితంగా పరిశీలించి చూసినట్లయితే  ఇందులో అనేక రకాల అంతర్వేదనలు ఉన్నాయనేది మనకు అర్థం అవుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు