సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -258
విహగ న్యాయము
**************"
విహగము లేదా విహంగము అంటే పక్షి.
పక్షి ఎక్కడా ఆగకుండా  సూటిగా చెట్టుపైకి ఎగిరినట్లు.
 తాను తినాలనుకున్న పండ్లున్న చెట్టును పక్షి చూడగానే వెంటనే ఎగురుతుంది.అటూఇటూ  చూడకుండా దృష్టి అంతా ఆ పండుపై నిలుపుతూ  మధ్యలో ఆగకుండా  సూటిగా ఆ పండున్న చెట్టు కొమ్మ మీదే వాలి ఆ పండును తింటుంది.
అంటే తాను చేయాలనుకున్న పనిలో ఎట్టి పరిస్థితుల్లోనూ గురి తప్పనీయదు.అంటే దాని యొక్క లక్ష్యం, అంచనా అంత సరిగ్గా వుంటుందన్న మాట.
ఈ న్యాయములోని అంతరార్థాన్ని గ్రహించినట్లయితే  మనం ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నామో దానిపైనే దృష్టి నిలపాలనీ, పక్షి ఏ విధంగా కింద నుండి చెట్టుకున్న పండును చూసి దానిని తినాలని అనుకుందో, అంతే సూటిగా ఆ పండునెలా  చేరుకుని తిన్నదో మనలో కూడా సంకల్పం కార్యదీక్ష ఆ స్థాయిలో ఉండాలని అర్థం.
 దీనికో చక్కని ఉదాహరణ మహా భారతంలోని అర్జునుని విలువిద్య కథ.
కౌరవులు, పాండవులు గురువైన ద్రోణాచార్యుడి వద్ద విలువిద్య నేర్చుకున్నారని మనందరికీ తెలుసు.
శిక్షణ పూర్తి అయిన తరువాత వారిలోని విలువిద్యా నైపుణ్యాన్ని పరీక్షించాలనీ, వారిలో అత్యుత్తమ విలుకాడు ఎవరో అందరికీ తెలియజేయాలని  ద్రోణాచార్యుడు అనుకున్నాడు.
ఈ ఆలోచన వచ్చిన వెంటనే సుదూరంగా ఉన్న ఓ చెట్టు కొమ్మపై ఒక చెక్క పక్షిని ఉంచాడు.దానికి ఓ కృత్రిమ కన్ను కూడా చిత్రింపజేశాడు.చాలా  నిశితంగా పరిశీలిస్తేనే ఆకుల మధ్య ఆ పక్షి కనబడేలా ఏర్పాటు చేశాడు.
శిష్యులైన కౌరవ పాండవులను పిలిచి "ఆ చెట్టు మీద ఓ పక్షి ఉంది దాని కంటి మీద సరిగ్గా బాణం వేయాలి. మీ మీ విలువిద్యా నైపుణ్యాలను ప్రదర్శించండి" అని వారిలో ఒక్కొక్కరిని పిలిచారు.  ధర్మరాజుతో సహా అందరినీ పిలిచి చెట్టు మీద ఏమి కనిపిస్తుందో చెప్పమని అడిగితే అందరూ చెట్టు కొమ్మలు,ఆకులు, పక్షి, మనుషులు కనిపిస్తున్నారని రకరకాలుగా చెప్పారు.చివరికి అర్జునుని పిలిచి "చెట్టుపై ఏం చూశావు?" అని అడిగితే "పక్షి కన్నును మాత్రమే చూశానని చెబుతాడు."మరేమీ కనిపించడం లేదా? అని మళ్ళీ ప్రశ్నించారు. "లేదు నాకు పక్షి కన్ను మాత్రమే కనబడుతోంది గురువు గారూ!" అంటాడు.ఆ తర్వాత  గురువు గారి అనుమతితో బాణాన్ని సంధిస్తాడు.అది వెళ్ళి సరిగ్గా పక్షి కంటికి తగుల్తుంది.
ఆ విధంగా అర్జునుడు అత్యుత్తమ విలుకాడు అని అందరికీ తెలిసి పోతుంది.
ఇక్కడ గ్రహించ వలసింది ఏమిటంటే  మనకంటూ సరైన లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన పట్టుదల, ఏకాగ్రత,గురి,నిశిత దృష్టి , పరిశీలనా శక్తి ఉండాలి.
అప్పుడే నేరుగా అనుకున్న లక్ష్యాన్ని చేరగలం.
 మొన్న మన భారత దేశ శాస్త్రవేత్తలు నిరూపించింది కూడా ఇదే .చంద్రయాన్ -3 భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్  ఎంతగా విజయవంతం అయ్యిందో,  ప్రపంచమంతా ఇదొక చారిత్రాత్మక ఘట్టమని ఎంత గొప్పగా ప్రశంసించిందో మనందరికీ తెలిసిందే.
నిర్దేశించిన సమయానికి ఒక్క క్షణం కూడా తేడా  రాకుండా చందమామ మీద ల్యాండ్ అవడం" మన శాస్త్రవేత్తల అంచనా, మేధాశక్తి ఎంత గొప్పదో మనకు అర్థం అవుతుంది.
అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే మనలో ఉండాల్సినవి అంచనా , సునిశిత పరిశీలన, పట్టుదల, కార్యదీక్ష  మొదలైనవన్నీ వుండాలని మనం ఈ "విహగ న్యాయము" ద్వారా తెలుసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు