ఓరి తెలుగోడా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తెలుగు మాట్లాడరా
కడుపులు నింపరా
తెలుగు నాలుకలు
తేనెల పట్టులురా

తెలుగు పలుకురా
దప్పిక తీర్చరా
తెలుగు పెదవులు
అమృత నెలవులురా

తెలుగు నేర్పరా
తీపిని పంచరా
తెలుగు చదువులు
తెలివిని ఇచ్చురా

తెలుగుబాట పట్టరా
పూలదారిన నడవరా 
సుమాల సౌరభాలు
పరిసరాల చల్లరా

తెలుగుపాట పాడరా
శ్రావ్యత కలిగించరా
తెలుగు రాగాలు 
తీపని నిరూపించరా

తెలుగుమాల అల్లరా
తల్లిమెడన వెయ్యరా
తెలుగు అక్షరాలు
గుండ్రని ముత్యాలురా

తెలుగు సొగసురా
కనగ ఇంపురా
తెలుగు పదాలు
వినగ సొంపురా

తెలుగును చాటరా
వెలుగులు చిమ్మరా
తెలుగు గొప్పలు
జగానికి చెప్పరా

తెలుగు దేశము
స్వర్గ సీమరా
తెలుగు జనులు
ఆత్మ బంధువులురా

తెలుగును వ్యాపించరా
విశ్వవిఖ్యాతము చెయ్యరా
తెలుగుమదులను తట్టరా
శాశ్వతస్థానము పొందరా

తెలుగుదీపాలు
వెలిగించరా
తెలుగుకాంతులు
వెదజల్లరా

తెలుగువైభవాలు
వల్లెవేయరా
నలుదిశలందు
మారుమ్రోగించరా

తెలుగు వ్రాయరా 
చక్కగ చదివించరా
తెలుగు నుడికారాలు
మనసుల ముట్టునురా

ఓరి తెలుగోడా
కలము పట్టరా
కడు కవితలు 
కమ్మగా కూర్చరా


కామెంట్‌లు