సునంద భాషితం ; వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -271
శంఖ వేలా న్యాయము
  ******
శంఖం అంటే శంఖము. వేలా అంటే సమయము, ప్రవాహము, సముద్ర తీరము, పొలిమేర అనే అర్థాలు ఉన్నాయి.
శంఖమును పవిత్రమైన వస్తువుల్లో ఒకటిగా చెబుతారు.
శంఖం యొక్క ధ్వనిని విజయానికి, సమృద్ధికి,, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీకగా భావిస్తారు.
దేవాలయాలలో యజ్ఞ యాగాదులలో, శుభ కార్యాల్లో శంఖ ధ్వని చేస్తుంటారు.
అయితే ఈ శంఖ శబ్దమునకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చూద్దామా...
ఒకానొక రాజుగారి భవనములో  ఒక శంఖం వుండేది. ప్రతిరోజూ ఉదయము నిర్ణీత సమయానికి రాజ భటులలో ఒక భటుడు శంఖమును ఊదే వాడు.ఆ శంఖారావం వినడానికి  ముందే సరిగ్గా ఆ వేళకు సేవకులందరూ హాజరై తమ తమ విధులలో ప్రవేశిస్తూ ఉండే వారు.ఒకోసారి ఆ శంఖారావం చేసే భటుడు ఆ సమయానికి శంఖ ధ్వని చేయకపోయినా సేవకులు మాత్రం అదే సమయానికి హాజరై తమ తమ విధులలో ప్రవేశించే వారు.
అలాగే రోజూ బడిలో గంట చప్పుడు వినగానే పిల్లలందరూ  బడికి వస్తూ వుంటారు. అయితే అలా క్రమంగా అలవాటయిన తరువాత గంట చప్పుడు వినకపోయినా అదే సమయానికి పిల్లలందరూ బడికి రావడం జరుగుతుంది.దీనికి సంబంధించి సైకాలజీలో/ మనస్తత్వ శాస్త్రంలో ఓ సిద్ధాంతం వుంది.అదే "శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం".
అదేంటో తెలుసుకుందాం. 
దీనిని రష్యాకు చెందిన జంతు శరీర ధర్మ శాస్త్రవేత్త అయిన ఇవాన్ పావ్ లోవ్  "శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతాన్ని" ప్రతిపాదించారు.
ఆకలితో ఉన్న కుక్కపై  చేసిన ప్రయోగం విజయవంతం అయ్యింది.కుక్కకు ఆహారం చూపించక ముందు ఊరిన లాలాజలం, చూపించిన తర్వాత ఊరిన లాలాజలాన్ని పరిశీలిస్తే ఆహారాన్ని చూడగానే లాలాజలం మామూలు కంటే ఎక్కువగా ఊరడం గమనించారు.
తర్వాత దాని మీదే మళ్ళీ ప్రయోగం చేస్తూ ఆహారం పెట్టే ముందు గంట మోగించి, శబ్దం చేసి  ఆహారం పెట్టడం ప్రారంభించిన తర్వాత  మళ్ళీ ప్రయోగంలో భాగంగా  గంట మోగించగానే అక్కడ ఆహారం లేకపోయినా కుక్క నోటిలో లాలాజలం ఊరడం గమనించారు.
అంటే ఒక  నిబంధనకు అలవాటు పడిన తర్వాత అక్కడ దానికి సంబంధించిన సంకేతాలు రాకపోయినా ప్రతిస్పందనలో మార్పు ఉండదు. దీనినే శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం అంటారు.
ఈ సిద్ధాంతం ప్రకారం రాజు గారి భవనంలో  గంట కొట్టక పోయినా ఆ వేళకు సేవకులందరూ పనుల్లో నిమగ్నమవడం.అలాగే విద్యార్థులు  గంట చప్పుడు వినకపోయినా వేళ తప్పకుండా బడికి రావడం అనేవి శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం వలె ఈ "శంఖ వేలా న్యాయము"నకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు