సునంద భాషితం ;- వురిమళ్ళ సునంద, ఖమ్మం
 న్యాయాలు -269
వ్యాఘ్రీ క్షీర న్యాయము
    *****
వ్యాఘ్రము అంటే పెద్ద పులి. క్షీరము అంటే పాలు. 
పెద్ద పులి పాలు ఎప్పుడు ఇస్తుంది. అది పిల్లల్ని కని బాలింతగా వున్నప్పుడు కదా!
మామూలుగానే మన చుట్టూ పరిసరాల్లో పిల్లి, కుక్క,పంది లాంటి జంతువులు ఈనినప్పుడు వాటి దగ్గరకు రానివ్వవు. దగ్గరకు వెళ్ళామంటే  గుర్రుమంటూ కోపంతో మీద పడి కరుస్తాయి.
అసలే ఆడపులికి పౌరుషం ఎక్కువ అంటారు.అలాంటిది అది ఈనినప్పుడు తనతో పాటు ఉన్న మగపులిని కూడా దగ్గరకు రానివ్వదట.వస్తే దాని ప్రాణం తీయడానికి కూడా వెనుకాడదట.
అలాంటి  పెద్ద పులిని అందులోనూ బాలింతగా వున్న పులి దగ్గరకు వెళ్ళి  నింపాదిగా పాలు పితికి తెచ్చేవాళ్ళు ఉంటారా?  ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.
తమను రక్షించుకునేందుకో పెద్దపులిని  వేటాడేందుకో వెళ్ళి  చంపేవాళ్ళు ఉంటారు కానీ పెద్ద పులి పాలు తీసుకొని రాగల ధీరులు, శూరులు ఎవరూ ఈ లోకంలో ఉండరు.
 పులి పాలు తీసుకొని వచ్చిన వీరుడి గురించి చెప్పాలంటే  ఈ  పురాణ గాథను రేఖామాత్రంగా తెలుసుకోవాల్సిందే. ఆ వీరుడే అయ్యప్ప.
వేట నిమిత్తం అడవిలోకి వచ్చిన పందళ దేశ రాజైన రాజశేఖరుడు అడవిలో బాలుని రూపంలో ఉన్న అయ్యప్పను చూస్తాడు. పిల్లలు లేని అతడు ఆనందంతో అయ్యప్పను పెంచుకునేందుకు తీసుకుని వెళతాడు .అయ్యప్ప  తరువాత రాజుకు మగబిడ్డ కలగడం.ఇద్దరినీ అల్లారుముద్దుగా పెంచుకోవడం జరుగుతుంది.
అయితే తమ కొడుక్కు కాకుండా  అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం చేయడం ఇష్టం లేని రాణి గారు తలనొప్పి నెపంతో అది తగ్గడానికి పులి పాలు కావాలని కోరుతుంది.మహారాణి కోరినట్లు  అయ్యప్ప పులి పాలు తెచ్చి ఇస్తాడు.ఇలా పురాణాలలో మాత్రమే పులి పాలు తీసుకొని వచ్చినట్లు కథనాలు ఉన్నాయి.
అలాగే మహా భారతంలో శకుంతల దుష్యంతుల కుమారుడైన భరతుడు బాల్యంలో పులులు సింహాలతో ఆడుకునే వాడని వాటి నోట్లో పళ్ళు ఎన్నున్నవో లెక్కించడం అనే ఆట భరతుడికి చాలా ఇష్టమని మాత్రమే చదువుకున్నాం.
 ఇక జంతు సంరక్షణ వాళ్ళు సర్కస్ వాళ్ళు వాటిని సంరక్షణ చేయడం వరకే  మనకు తెలుసు.
అంటే పులి పాలు ఇవ్వడం ఎంత నిజమో, వాటిని తీసుకుని రావడం అంత అసంభవం అని చెప్పేందుకు ఈ న్యాయము సరిగ్గా సరిపోతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు