ఇంద్రధనస్సు ఎక్కుపెట్టిన బాణాలు
ఒక్కొక్కటి రంగుల కలల
మెత్తటి హృదయానికి గుచ్చుకున్నవి
గాయమైంది
రక్తశ్రావం జరిగింది
పర్వతం నేలకొరిగింది.
గాలి గడ్డ కట్టింది.
ఎదిరించిన మంచు ముత్యాలు
పచ్చిక బయల కళ్ళ వెంట ఆగి చూస్తున్నవీ
మెల్లిగా కదిలిన పిల్లగాలి ఆకుపచ్చని లోగిళ్ళ
ఇళ్లకు తోరణాల్లా వేలాడుతున్నాయి.
కంటి కాటుకలో ఆపిల్ పళ్ళు తుర్లిపడుతూ
పరుగిడుతున్నవీ
పొద్దుగుంకిన సూర్యుని మధ్య
దిగిన చిత్రం ఆ రెండు కళ్ళు.
కాళ్లకు పారాణి ఆరని కాలం
వెలుగుతున్న దివ్య తైలమై
బగ్గున మండుతున్నది.
నేలపై నెలవంకను పాదాలు లేకుండా ముద్దాడలేము
నడవడమే నాగరికత కథ
ఆగిపోయిన చూపునడిగి
చరిత్రను రచించలేము.
మౌనంగా గగనము ఆ లింగనం చేసుకుంటుంటే
గుండెల కత్తుకునే ముత్తయిదువను
మూడు కాలాలు ఆరు రుతువులు
ఆవిర్భవించినట్లు ఆమె ప్రకటించింది.
వెనక్కి లాగే నదుల్ని హృదయాన్ని సముద్రంలో కలపాలని ప్రయత్నించకండి.
అంతకుముందే ఆదేశించబడిన
మార్గాలు మార్చకండి మరచిపోకండి.
వెలుగు వెంటే వెళ్తానని ఆశపడతాం
కండ్లుంటేనే కదా
చీకటి ఏదో వెలిగేదో తెలిసేది.
ముందు కండ్లను కనండి.
ఆకలిగా ఉన్న మైదానం పచ్చగానే ఉంటుంది.
కానీ చీకట్లో ఆకలిగా ఉంటూనే ఉంటుంది.
నిద్దుర గాయం మాన్పించిన రాత్రి
పొద్దున్నే నిద్రపోద
అది దాని దరిద్రం.
ఏదీ లాక్కోకు దేనికి ఆశపడకు
నీకోసమే ఉదయం ఉంది
దానికి హృదయం ఉంది.
కునుకు తీసిన క్షణం
కొలిమిలో కాలిపోతుంది
రేపటి ఆయుధం అది కావచ్చు.
మౌనంగా శరీరం ఎదుగుతుంది
మనసుకు తెలియదు దాని వయసు.
కరిగిపో తిరిగి రూపం మార్చుకో
కానీ కాలాన్ని నిందించకు అది అనాధ.
శృంగారం అంగాల వెంట పరుగిడదు
పర్వం ఇంటా వెలుగుతుంది
సర్వస్వం శరీరమే కాదు మనసు కూడా ఉంటుంది..
దాని జ్ఞాపకాలే వళ్ళు కలలే ఇల్లు.!!!!!!?
ప్రతాప్ కౌటిళ్యా 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి