సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -288
శ్మశాన కుసుమ న్యాయము
*****
శ్మశానాన్ని శ్మశాన వాటిక,,వల్లకాడు.కాడు, కాష్టం అని అంటారు. కుసుమము అంటే పువ్వు.,సుమం ,విరి అనే అర్థాలు ఉన్నాయి.శ్మశాన కుసుమం అంటే వల్లకాట్లో పూలు అని అర్థం.
చనిపోయిన వ్యక్తిని శవం అంటారు. ఆ వ్యక్తిని శ్మశానానికి తీసుకుని వెళ్లి వారి వారి సంప్రదాయం  అక్కడ  గోయిలో పూడ్చి పెట్టడమో లేదా  చితిలో కాల్చడమో చేస్తుంటారు.  వీటినే దహన సంస్కారాలు అంటారు.
 మానవులు ఎవరు కూడా సహజంగా  శ్మశానానికి వెళ్ళడానికి  ఇష్టపడరు.కారణం  అక్కడ  మరణించిన వారికి కట్టిన సమాధులు వుంటాయి.దహన సంస్కారాల సమయంలో అంతులేని రోదనలు, జ్ఞాపకాల రొదలు వుంటాయి.అందుకే అలాంటి ప్రదేశాలకు ఎవరూ వెళ్ళరు. వెళ్ళాల్సి  వచ్చినప్పుడు భయపడుతూ వుంటారు.
మరి అలాంటి స్థలాల్లో ఎంత అందమైన పూలు పూస్తేనేం!మంచి రుచికరమైన పండ్లు కాస్తేనేం!వెళ్ళి కోసుకొని రాగలరా? వాటిని ధైర్యంగా ఉపయోగించుకోగలరా?జవాబు లేదు అనే వస్తుంది.
 కాబట్టే శ్మశానంలో ఎంత రంగు రంగుల, ఆకర్షణీయమైన పూలు పూచినా వాటికి ఉపయోగం వుండదు.ఎవరూ గుర్తించరు.అందువల్లే నిష్ప్రయోజనం అనే అర్థంతో ఈ "శ్మశాన కుసుమ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 అలా బతికుండగా వెళ్ళడానికి ఇష్టపడని స్థలం రుద్రభూమి, వల్లకాడు అని అందరికీ తెలిసిందే కదా!అయితే ఎందుకు ఈ న్యాయాన్ని  ప్రస్తావించారు! అనే సందేహం ఎవరికైనా వస్తుంది.
ఎందుకలా చెప్పారో చూద్దాం. కొంతమంది కొన్ని పనులు చేస్తుంటారు .కానీ వాటి వల్ల తనకే కాకుండా ఎవరికీ ప్రయోజనం ఉండదు.అలాంటి వారిని ఉద్దేశించి చెప్పిందే ఈ న్యాయము. 
"సముద్రంలో కురిసిన వర్షం". "అడవి గాచిన వెన్నెల" మొదలైన జాతీయాలతో  ఈ"శ్మశాన కుసుమ న్యాయానికి" దగ్గర పోలికలు ఉన్నాయి.
" సముద్రంలో ఎంత వర్షం కురిసినా ఏం ఉపయోగం. ఆ నీళ్ళు ఉప్పగా ఉండి అటు తాగడానికి కానీ, పంటలు పండించడానికి కానీ ఉపయోగపడదు. అలాగే "నిండు పున్నమి  పండు వెన్నెల"  ఆస్వాదిస్తే, అనుభూతిస్తే ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. అలాంటి వెన్నెల అడవిలో కాస్తే ఎవరు దాని గొప్పదనాన్ని గుర్తిస్తారు.దాని వల్ల ప్రయోజనం లేదు కదా!"
 కాబట్టి  చేసే పని చిన్నదా! పెద్దదా! అని కాకుండా ఆ పనివల్ల అంతో ఇంతో ఉపయోగం తనకైనా ఇతరులకైనా  ఉండాలి.
 అలా చేస్తే ఆ పని  బతుకమ్మ పండుగ కోసం ఉపయోగించే  రకరకాల పువ్వుల్లా కొంతైనా ప్రయోజనం ఉంటుంది.
 " ఏది నిష్ప్రయోజనం? ఏది ప్రయోజనం? ఈ "శ్మశాన కుసమ న్యాయము" ద్వారా తెలుసుకున్నాం కదా! చేసే పనిలో ఇసుమంతైనా మంచి వుండి ఉపయోగపడేలా చేద్దాం.మరి మీరేమంటారు?
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు