లాజిక్! అచ్యుతుని రాజ్యశ్రీ

 క్లాస్ లో టీచర్ పాఠం చెప్పాక చిన్న చిన్న ప్రశ్నలు వేసింది.కొందరు పాఠంలో ఉన్న దాన్ని అప్పచెప్పితే ఇంకొందరు సొంత మాటల్లో చెప్పారు.వీరిని టీచర్ "వెరీగుడ్" అని అనగానే శివా కాస్త కోపంగా" టీచర్! నేను పాఠంలోని పాయింట్స్ అన్ని రాసుకుని చెప్పాను.వారు కొన్ని చెప్పలేదు కదా?" అని అడిగాడు.టీచర్ నవ్వుతూ అంది " మార్కుల కోసం నీవు చదువు తున్నావు.వీళ్ళు సొంతం గా తాము రేడియో లో విన్నవి పేపరులో చదివినవి కల్పి చెప్పారు.ముఖ్యంగా హరి అలా చెప్పాడు" అంది.హరి వెంటనే ఇలా అన్నాడు " టీచర్!మా అమ్మమ్మ రోజూ ఒక ప్రశ్న అడిగి జవాబు చెప్పమంటుంది. ఇవాళ ఓప్రశ్న అడిగింది దేవుడు ఎక్కడ ఉన్నాడు అని.దీనికి జవాబు నాకు తెలీదు." శివా వెక్కిరిస్తూ అన్నాడు" ఓష్! గుడిలో ఇంట్లో పూజాగదిలో ఉంటాడు."" ఉహు నేను అలా చెప్తే తప్పు అంది మా అమ్మమ్మ" హరి బాధగా అన్నాడు."దేవుడు సర్వాంతర్యామి కదా? అన్ని చోట్ల ఉంటాడు.ఇందుగలడందులేడని సందేహంబు వలదు.చక్రి సర్వోపగతుండు అన్నాడు కదా ప్రహ్లాదుడు!" జయ అంది."ఎలా? వివరించు జియా?" టీచర్ అడిగింది."టీచర్!మనకు పాలు ఎక్కడ దొరుకుతాయి?""ఓష్ ! షాపు లో పాలపాకెట్స్ ఉంటాయి కదా?" పిల్లలు అంతా అరిచారు." ఆ.. ఇక్కడ లాజిక్ ఉపయోగించాలి.ఆవులు గేదెలనుంచి పాలు పిండి సేకరిస్తారు.వాటి శరీరంలోంచి పాలు వస్తాయి?" "టీచర్! పొదుగు లోంచి మాత్రమే పాలువస్తాయి" హరి ఠక్కున జవాబిచ్చాడు." కరెక్ట్! దేవుడు సర్వాంతర్యామి.కానీ మనలాంటి సామాన్యులకు సులభంగా దొరకడు. అందుకే యోగులు సదా ఆయన ధ్యానం లో ఉంటారు.వారి లాగా మనం ఉండలేం కాబట్టి కనీసం గుడికి వెళ్ళి కొద్ది సేపైనా అక్కడ కూచుని దైవస్మరణ చేయాలి.స్వామి వివేకానంద చెప్పినది అదే.ముక్కుమూసుకుని భక్తుడిని అంటే సరిపోదు.ఇతరుల మంచి కోరుతూ చేతనైన సాయం చేయడమే దైవారాధన పూజ.కలికాలంలో ఇదే తరుణోపాయం." టీచర్ మాటల్తో పిల్లలంతా ఆనందంగా చప్పట్లు చరిచారు🌹🌹
కామెంట్‌లు