యుద్ధం..... !- కోరాడ నరసింహా రావు
ఈ నిరంతర యుద్ధక్షేత్రమైన సమాజంలో... 
   ఆందోళన, అలజడి, అశాంతి కాక.... సుఖము, శాంతి, ఆనందం ఎలా ఉంటుంది !?

ప్రాణి పుట్టుక యే... తల్లి గర్భంలో... యుద్ధంతో మొదలౌతుంది !

అది మొదలు... అడుగడుగునా, అనుక్షణం యుద్ధమే... !!

 చుట్టూ ఉన్న ప్రపంచంలో... 
  అందరితోనూ...అన్నిటితోనూ 
 ప్రత్యక్ష... పరోక్ష  తప్పనిసరి యుద్దాలే... !

పుట్టినది మొదలు అలవాటైపోయినందుననే.. 
  మనం చేస్తున్నవి యుద్దాలని, 
 గెలుపోటములతో... పొంగు - క్రుంగుల అనుభవాలకు, అంతగా ప్రతిస్పందించ లేక పోతున్నాం.. !!

దేశాలకీ - దేశాలకీ మధ్యే కాదు 
 రాష్ట్రాలకూ - రాష్ట్రాలకూ... 
 వ్యవస్థలకూ  - వ్యవస్థలకూ... 
  వ్యక్తులకూ  - వ్యక్తులకూ... 
   అక్కడితోనే ఆగుతున్నాయా ఆ యుద్దాలు ?!

ప్రత్యక్షంగానో... పరోక్షంగానో... 
 ముఖాముఖినో - ప్రచ్ఛన్నం గానో... యుద్దాలు అనివార్యాలే... !!

 పరులతోనే కాదు... 
.  మనతో... మనమే యుద్ధంచేసే పరిస్థితి... !

మనసు కోరుతుంది... 
 బుద్ధికూడా దంటుంది... 
   చిత్తము తోడవుతుంది... 
   అహంకారము తగ్గనంటుంది 
అనుక్షణం... ఈ అంతర్యుద్ధం !

మనిషికి సహజ పరిస్థితులతో 
చెయ్యాల్సిన యుద్దాలు.. ఎలాగూ  తప్పనిసరి... !
   తనదురహంకారంమూలంగా  జరుగుతున్న యుద్దాలే... 
  అపరిమిత అనర్ధాలను సృష్టించేది !

మనిషి తను చెయ్యాల్సిన చోట... 
  చెయ్యాల్సిన పద్దతిలో... 
 యుద్ధం చెయ్యక... 
  అనవసర యుద్దాలమూలంగానే ఈ దుస్థితి !

చెయ్యాల్సిన ఆ ఒక్కయుద్దము చేసి విజయుడైతే... 
  ఈ యుద్దాల ప్రసక్తే రాదు కదా 

ఓ మనిషి.... !
  చెయ్... యుద్ధముచేయ్.. !
  నీకు శత్రువులెవరూ...బయటలేరు 
నీ లోనే... ఉన్నారు... 
  బుద్ది అనే నీ మంత్రి సలహా తీసుకో... 
   నీ వివేకపు సేనాపతిని వినియోగించు..., 
    ఆ అరిషడ్వార్గాన్ని నిర్జించి విజయుడవు కా.... !

అప్పుడిక... ఈ ప్రపంచమంతా 
శాంతి, సుఖము, ఆనందమే !!
      ******

కామెంట్‌లు