సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -303
షాష్ఠ తిర్యగధికరణ న్యాయము
*****
షాష్ఠ అంటే ఆరవ, తిర్యక్  అనే పదము ఎక్కువగా తరంగాల గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. నిశ్చలంగా ఉన్న నీటిలో ఓ గులకరాయిని వేస్తే అది పడిన చోట వృత్తాకార తరంగాలు అంటే అలలు ఏర్పడటం మనందరికీ తెలిసిందే. అలా తరంగాలు ముందుకు పురోగమిస్తున్న  సమయంలో తేలికగా వుండే బెండు బంతిని వేసినప్పుడు అది పైకీ కిందకీ కదలడంతో తరంగాలు 180 డిగ్రీల పరావర్తనం చెంది మరల వెనుకకు వస్తాయి. అలా పురోగామి తరంగాలకు ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు  తరంగాలు వెనక్కి రావడాన్ని తిర్యక్ తరంగాలు అంటారు.
ఇక అధికరణ అంటే ఆధారము, ఒక విషయమునకు సంబంధించిన వాదోపవాదములు,న్యాయస్థానము.
అది  సైన్స్ కు సంబంధించిన విషయం. కానీ ఇక్కడ  మనం చెప్పుకునేది  సంస్కృత న్యాయాల పరిభాషలో . కాబట్టి ఆ దృష్టితో చూద్దాం.
 ఏదైనా విషయాన్ని సాఫీగా పోనీయకుండా  వివిధ రకాలుగా అంటే ముందుకు పోనీయకుండా, అనుకున్నది కానీయకుండా అడ్డుపడి అనేక రకాలుగా మెలికలు పెట్టడం  అన్న మాట.
 "షాష్ఠ తిర్యగధికరణ" "అంటే శాస్త్ర పరమైనవో లేదా ఊహించో రకరకాల ఋజువులు చూపుతూ, ఏదైనా ఓ విషయాన్ని లేదా సమస్యను పరిష్కార దిశలో పయనించనీయకుండా మెలికలు పెట్టి అడ్డుకోవడాన్ని  "షాష్ఠ తిర్యగధికరణ న్యాయమని" మన పెద్దలు అంటుంటారు.
ఇదంతా చదువుతుంటే కొంచెం అయోమయంగా ఉండటం సహజం.
కాబట్టి దీన్ని గురించి అతిగా ఆలోచించకుండా     ఇలా  "వేలికేస్తే కాలికేస్తాడు - కాలికేస్తే వేలికేస్తాడు"  "బోడిగుండుకు  మోకాలికి ముడిపెట్టడం " అనే సామెతలతో పోల్చవచ్చన్న మాట.
ఇలా కొంత మంది ఏదైనా విషయాన్ని లేదా  సమస్యను ముందుకు సాగనీయకుండా తర్కిస్తూ, మెలికలు పెడుతూ వుంటారు.అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ  వాటిని సాధ్యం కానివ్వరు.
"ఇదండీ"షాష్ఠ తిర్యగధికరణ న్యాయము" అంటే. కొంచెం అర్థమయ్యీ కానట్టుగా అనిపిస్తుంది కదండీ! అలా తిరకాసు పెట్టడమే ఈ న్యాయము లోని అంతరార్థం.
 కాబట్టి ఏదైనా సమస్యనేది  ఉంటే  దాని పరిష్కారం పురోగమన దిశగా సాగేలా చూడాలి కానీ, తిరోగమనం లోకి తీసుకుని వెళ్ళకూడదని తెలిసిపోయింది కదా!. అలాంటి పనులు చేయనూ వద్దు. అలా చేసేవారికి ఇలాంటివి చెప్పనూ వద్దు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు