సమ్మక్క సారలక్క పద్యాలు:;- డి.వినాయక్ రావు M.A. MEd భైంసా , జిల్లా నిర్మల్ ఫోన్ 9440749686
కం:కూనగ జనించి కానల
దానవ జనమంత మొంద ధైర్యము వలనన్
రాణిగ  సమ్మక్కయ్యెన్
జానిగ పగిడిద్దరాజు సరసన నిల్చెన్

సీ:సమ్మక్క సంతయ్యె సారలక్కయు నాగ
వనదేవతలు వారు వరము లిచ్చు
గిరిపుత్రులందరి మురిపించు వేల్పులు
చిలుక గుట్టలయందు స్థిరము నైరి
జంపన్న వాగులో స్నానాలు జేసేరు
గొలువగద్దెలపైన గొలువు దీరు
బంగారమనియిచ్చు  భక్తి బెల్లపుముద్ద
కడుప్రీతి నొందుతు కడుపునింపు
ఆ.వె:దేవ గణము నుండి దివ్యులై వచ్చిరి
మాన వులుగ మారి మంచి జేయ
శౌర్య మున్న వారు సమ్మక్క సారక్క
సమర భూమి యందు సమరథుండ్రు

చం: వనముల వేల్పులై జనము భాగ్యమునొందను  కొల్వు దీరుచున్
కనపడు మూర్తులయ్యెనవి కాంచన భర్ణులు దైవ రూపులై
జనమది నొంద సంతసము జాతర జేయగ సాగె, పూజలో
తినుమని తల్లులిద్దరిని  దీనులు వేడుచు బెల్లమీయగన్

మత్తే:వనమందున్ జన వేల్పులై  వెలసె  నివ్వంగన్ వరాలడ్గ నా
 జనమౌ సంద్రము గొల్వ దేవతలగున్ సమ్మక్క సారక్కలా
ఘనమౌపూజలు మేలతాళములు మ్రోగంగాను వారిర్వురిన్
వనమౌ సంతస సంబరంబగును  గొల్వంగా ప్రజా తల్లులన్

ఉ:దీరులు శూరులిర్వురును దీనుల బ్రోచెడి దైవరూపులా
మూరితి నమ్మలిర్వురిది ముద్దగు  కుంకుమ భర్ణులందునన్
బారులు దీరు దర్శనము భాగ్యము నంటుగ భక్తు లందరున్
సారెను చీరలివ్వగను  సౌఖ్యము పంచెడు తల్లులిర్వురున్


కామెంట్‌లు