*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* -*శతరుద్ర సంహిత --(0290)*
 శౌనకాది మునులు, సూత మహర్షి సంవాదంలో.....

శివ భగవానుని అష్టమూర్తులను, అర్ధనారీశ్వర రూప వర్ణన........

*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*


*నందీశ్వర, సనత్కుమార సంభాషణం :*

*నందీశ్వరుడు (నం.) చెపుతున్నారు: 
*ఈ చరాచర జగత్తు మొత్తము, సౌఖ్యమును ఇచ్చే పరమేశ్వరుని యొక్క అష్టమూర్తుల సమాహారమే. మనకు కనబడుతూ, కనబడకుండా ఉన్న ఈ విశ్వమంతా, శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు అని పిలువబడే, పరమేశ్వరుని అష్టమూర్తుల అవతార స్వరూపముల కలయికయే. ఈ శంభుని అష్టమూర్తులు, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, క్షేత్రజ్ఞుడు, సూర్యుడు, చంద్రులలో అధిపతులుగా ఉన్నారు.*

*ఈ విశ్వాన్ని అంతటినీ మోస్తూ, కళ్యాణకారుడుగా ఉన్న మహేశ్వరుని రూపమే భూమి. ఈ "భూమి"లో వ్యాపించి ఉన్నవాడే "శర్వుడు". పరమాత్మ అయిన శంకరుడు జలము రూపములో జగత్తుకు జీవనాన్ని ప్రసాదిస్తున్నారు. ఈ "జల" రూపమే, "భవుడు". ఈ జగత్తు లోపల, బయట వ్యాపించి ఉండి, పోషించి, స్పందన కలగచేస్తూ ఉగ్రరూపంతో ఉన్న శంభుడే " ఉగ్రుడు". ఈ చరాచర జగత్తులో కనిపించే ఆవేశ కావేశల రూపంలో వ్యాపించి ఉన్న శంభుని, "రుద్రుడు" అని పిలుస్తున్నారు. అందరికీ అవకాశం ఇస్తూ, సర్వ వ్యాపిగా ఆకాశ రూపంలో ఉన్న శంకరుడు, "భీముడు". ఆకాశము అనంతము. అంతటా వ్యాపించి ఉన్నది. ఆకాశ రూపము భీముడు. కనుక, "భీమ" రూపంలో శంభుడు అంతటా వ్యాపించి ఉన్నారు అనేది సత్యం. అందరి జీవులు వేరు వేరుగా కనబడడానికి కారణము కూడా ఈ "భీమ" రూపమే.*

*"పశుపతి" రూపంలో శంభుడు అన్ని ఆత్మలకు ఆలంబనగా ఉన్నారు. జీవులకు కలిగే ఇహలోక బంధాలను తొలగిస్తూ ఉంటాడు, "ఆత్మ" రూపంలో ఉన్న "పశుపతి".  మహేశ్వరుడు ఈ చరాచార జగత్తుకు సూర్యదేవుని రూపంలో, ఆకాశంలో సంచరిస్తూ, ప్రాణుల జీవనానికి అవసరమైన వెలుగును ఇస్తున్నారు. శంకరుని "సూర్య" రూపమే "ఈశానుడు". చల్లని అమృతమయమైన తన కిరణములతో ఈ జగత్తు అంతటికీ తన చల్లని వెలుగులతో, ప్రశాంతతను ఇస్తున్నాడు, నింగిలో ఉన్న చంద్రుడు. శంకరుని, "చంద్ర" రూపమే "మహాదేవుడు" అని పిలువబడుతోంది.*

*ఈ విధంగా చరాచర జగత్తు మొత్తంలో వ్యాపించి ఉన్న అష్టమూర్తులు, "శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు" పరమేశ్వరుని రూపములే. ఈ లోకములో, తన వంశము మనములు, ముని మనములతో కళకళలాడుతుంటే ఒక తండ్రి ఎలా సంతోషిస్తాడో, అలాగే ఈ విశ్వమంతా సంతోషంగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఆనందిస్తాడు. ఈ భావన ఆధారంగానే గురువులు "సర్వేజనా సుజనో భవన్తు! సర్వే సుజనా సుఖినో భవన్తు!" అని చెపుతున్నారు. అంటే, పరమేశ్వరా! నీ సృష్టిలో ఉన్న వారిని అందరినీ మంచివారిగా చేయి. అలా మంచి వారిగా ఉన్నవారు అందరూ, సుఖ సంతోషాలతో ఉండేట్టుగా చేయి. నీవు, ఇలా  చేయడం వలన నీ సృష్టి మొత్తం మంచి లక్షణాలు కలవారితో నిండిపోయి ఉంటుంది. తద్వారా, అష్టమూర్తుల రూపంలో ఈ విశ్వమంతా నిండియున్న పరమేశ్వరుడు సంతోషంగా ఉంటారు. ఈ జగత్తులో, ఒకరిని ఒకరు పూజించి, గౌరవించుకుంటే, శంభుని పూజ చేసినట్లే.*

*ఇతి శివమ్*

*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*

.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ


Nagarajakumar.mvss
కామెంట్‌లు