నెయ్యి  పులగం (సరదా జానపద కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఒకూర్లో ఒకడు ఉండేటోడు. వానికి చిన్నప్పుడే ఇంకా పేరు గూడా పెట్టకముందే వాళ్ళమ్మా నాయనా చచ్చిపోయినారు. దాంతో అందరూ వాన్ని 'రేయ్ రేయ్' అని పిలిచేవాళ్ళు. వాడు నెమ్మదిగా పెరిగి పెద్దగయినాక తనలాగే ఎవరూ లేని ఇంకొకామెని చూసి పెండ్లి చేసుకున్నాడు.
పెండ్లయినాక కడపమాను దాటి లోపలికి పోయే ముందు మొగుని పేరు పెండ్లాం... పెండ్లాం పేరు మొగుడు చెప్పాల గదా! దాంతో వాని పేరు తెలీక ఆమె 'నీ పేరేమి' అనడిగింది. దానికి వాడు “ఏమోబ్బా నాకు తెలీదు. మా అమ్మానాన్న చిన్నప్పుడే పేరు పెట్టకముందే చచ్చిపోయినారు. ఇంతకూ నీ పేరేమి" అనడిగినాడు. దానికామె "మా అమ్మానాన్నా గూడా చిన్నప్పుడే చచ్చిపోయినారు. నాకు గూడా నీలాగే ఎవరూ పేరు పెట్టలేదు" అనింది.
దాంతో వాళ్ళిద్దరూ ఎవరూ పెట్టకుంటే ఏంలే. మనకు మనమే పెట్టుకుందాం అనుకోని 'ఆమెకు పులగమనీ, వానికి నెయ్యనీ, వాళ్ళ బరగొడ్డుకు దొంగనీ" పేరు పెట్టుకున్నారు. ఆరోజు నుండీ వాళ్ళిద్దరూ "ఏమే పులగం అంటే ఏమే నెయ్యీ" అని పిలుచుకుంటా హాయిగా వున్నారు.
ఒకరోజు ఒక దొంగ దొంగతనం చేయడానికని వీళ్ళ ఊరికొచ్చినాడు. వాని కన్ను వీళ్ళింటి మీద పడింది. వాళ్ళకెవరూ లేరు గదా... దాంతో బంధువని చెప్పి మోసం చేసి ఇంట్లోవన్నీ మట్టసంగా ఎత్తుకొని పోవాలని అనుకున్నాడు.
నెయ్యి పొలం దున్నుతా వుంటే పోయి "ఏరా బాగున్నావా... ఎంత కాలమయింది నిన్ను చూసి... నన్ను గుర్తుపట్టలేదా. మీ అమ్మకు వరుసకు తమ్ముడిని అవుతాను” అంటూ ఏవేవో దొంగమాటలు, దొంగ సంబంధాలు చెప్పినాడు. వాడు అవన్నీ నిజమనుకోని లేకలేక బంధువొచ్చినాడని సంబరపడి “ఇదింత దున్ని నే వస్తా గానీ నువ్వు ఇంటికి పో. ఇంటికాడ పులగముంటాది" అని చెప్పినాడు.
పులగమంటే వాని పెండ్లామని ఈ దొంగకు తెలీదు గదా, దాంతో ఓహో ఇంట్లో పులగం చేసినారన్నమాట. ఐతే పోయి బాగా మెక్కొచ్చులే అనుకోని సంబరంగా ఇంటికి పోయి జరిగిందంతా చెప్పినాడు. ఆమె గూడా నిజంగానే మొగుని తరుపు బంధువనుకోని కడుక్కోడానికి నీళ్ళిచ్చి కూచోడానికి మంచమేసి, ఆమాట ఈమాటా మాట్లాడతా "ఇప్పుడే తింటావా లేక నెయ్యి వొచ్చినాక తింటావా" అనడిగింది. నెయ్యంటే ఆమె మొగుడే అని వానికి తెలీదు గదా. దాంతో పులగంలో నెయ్యేసుకోని తింటే కమ్మగా వుంటాది అనుకోని “తొందరేం లేదులే... నెయ్యొచ్చినాకనే తింటా" అన్నాడు.
కాసేపటికి నెయ్యి ఇంటికి వచ్చినాడు. వానికి ఇంటి బైట బరగొడ్డు తిరుగాడుతా కనబడింది. అది చూసి గట్టిగా పెండ్లాంతో "ఏమే... దొంగను అట్లా వదిలిపెట్టినావు. తాడు తీసుకోని తొందరగా రా కట్టేద్దాం" అని అరిచినాడు.
దొంగ అంటే బరగొడ్డని వానికి తెలీదు గదా. దాంతో వాడు “అయ్యబాబోయ్... నేను దొంగతనానికి వచ్చినేది వీనికి తెలిసిపోయినట్లుంది. అందుకే పెండ్లాంతో తాడు తెమ్మంటున్నాడు" అనుకోని అదిరిపడి వాళ్ళు ఆగు ఆగంటున్నా వినకుండా, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయినాడు. వాడు అలా ఎందుకు పారిపోయినాడో వీళ్లకు అస్సలు అర్థం కాలేదు.
***********
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం