గిలిగాడు (సరదా జానపద కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
  ఒకూర్లో ఒక ముసల్ది వుండేది. ఆమె దగ్గర చానా గొర్రెలుండేవి. దాండ్లను ఆ ముసలమ్మ చానా జాగ్రత్తగా కాపాడతా వుండేది. ఎందుకంటే ఆ వూరి పక్కనే ఒక పెద్ద అడవుంది. ఆ అడవిలో ఒక పులుంది. ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా అది మట్టసంగా వచ్చి లటుక్కున ఏదో ఒకదాన్ని పట్టుకోని అడవిలోనికి ఎత్తుకోని పోయేది.
ఒకరోజు ఆ ముసల్ది గొర్రెలకు కాపలాగా మనవన్ని కూచోబెట్టి “రేయ్! నిద్రపోకుండా బాగా కాపలా కాయి. రాత్రి గొర్రెల కోసం ఏదైనా పులిగానీ, గిలిగానీ రావచ్చు. జాగ్రత్త" అని చెప్పిపోయింది.
అప్పటికే పులి ఎవరి కంటా పడకుండా ఆ మందలోనికి వచ్చేసింది. ముసల్ది పులిగానీ గిలిగానీ వస్తాది జాగ్రత్త అనింది గదా, ఆ మాటలు విన్న పులి "పులంటే నేను. మరి గిలంటే ఏంది? అది ఎట్లాగుంటాది? నా లెక్కనే వుంటాదా, లేక నాకన్నా భయంకరంగా వుంటాదా" అని ఆలోచించసాగింది.
అదే సమయంలో ఒక దొంగోడు ఏదైనా గొర్రెను ఎత్తుకపోదామని దభీమని ఎగిరి లోపలికి దుంకినాడు. ఆ చప్పుడుకి పులి అదిరిపడింది. చీకట్లో దానికి ఎమీ కనబడక “కొంపదీసి గిలిగాని రాలేదు గదా?'' అని భయపడసాగింది.
దొంగోనికి చీకట్లో ఏ గొర్రె ఎంత లావుందో అర్థంకాక ఒక్కొక్క గొర్రెనే పట్టుకొని, “ఎంత లావుందో'' అని తడిమి తడిమి చూడసాగినాడు. అట్లా ఒక్కొక్కదాన్నే తడుముతా తడుముతా పులి దగ్గరకొచ్చి తడిమినాడు. పులి భయంతో వణికిపోతా మట్టసంగా నోరు మూసుకొని కూచోనింది.
పులి బాగా బలంగా పెద్దగా లావుగా వుంటాది గదా. దాంతో దొంగోడు 'ఈ గొర్రేదో బాగా బలిసినట్టుంది. దీనిని ఎత్తుకొని పోతే డబ్బులే డబ్బులు" అనుకోని దాని కాళ్ళు పట్టుకోని ఎత్తి భుజం పైన వేసుకున్నాడు. అంతే పులికి పై ప్రాణాలు పైన్నే పోయినాయి. భయంతో బిక్క చచ్చిపోయింది.
దొంగోడు నెమ్మదిగా గోడ దూకి ఆడవిలో కొంత దూరం నడిచేసరికి వానికి భుజం పట్టేసింది. 'ఎంత బరువుందిది' అనుకుంటా దాన్ని కిందికి దించి దాని మీద ఎక్కి కూచోని “థాయ్. పా... పా..." అంటూ వీపు మీద ఒక్కటి పెరికినాడు.
ఆ దెబ్బకు పులి ''ఈ గిలిగాడెవడో సామాన్యుడు కానట్టుంది. అందుకే నా మీదే ఎక్కి కూచోని నన్నే తంతా వున్నాడు. వీడు చెప్పింది చెప్పినట్టు చేయకుంటే చంపినా చంపేటట్టున్నాడు. యాన్నో ఒకచోట వీడు దిగుతాడు
గదా, అప్పుడు సందు చూసుకోని పారిపోవాల. అంతవరకూ చెప్పినట్టు వినడం మంచిది'' అనుకోని మట్టసంగా నడవడం మొదలు పెట్టింది.
అట్లా చీకట్లో చానా సేపు నడిచినాక నెమ్మదిగా ఆకాశంలో చంద్రుడు మాయమై పొద్దు పొడవడం మొదలుపెట్టింది. కొంచెం కొంచెం వెలుతురు రాసాగింది. దొంగోడు తాను ఎతుకోనొచ్చిన గొర్రె ఎంత లావుందో ఏమో చూద్దామని వంగి చూసినాడు. గొర్రె బదులు పులి కనబడేసరికి గుండె గుబేలుమనింది. “ఓరినీ! అప్పన్నించీ నేను పులి మీద వస్తా వున్నానా" అని భయంతో వణికిపోయినాడు. “ఎట్టాగబ్బా దీన్నుంచి తప్పించుకోవడం" అని ఆలోచించసాగినాడు. పులి పరిస్థితి గూడా అట్లానే వుంది. దానికి దొంగోన్ని మోసుకుంటా నడిచీ... నడిచీ... కాళ్ళు పీకతావున్నాయి. ఆగితే గిలిగాడు ఏం చేస్తాడో ఏమో అని భయంతో అట్లాగే నడుస్తా... వీన్నించి తప్పించుకోవడం ఎట్లాగబ్బా అని ఆలోచించసాగింది. అట్లా పులిని చూసి దొంగోడు, దొంగోన్ని చూసి పులి భయంతో వణికిపోతా వున్నారు.
కొంత దూరం పోయేసరికి దారిలో ఒక పెద్ద చెట్టుకొమ్మ బాగా కిందికి వంగి కనబడింది. దాంతో వాడు ఆ చెట్టెక్కితే పులి నుంచి తప్పించుకోవచ్చు గదా అనుకోని ఆ చెట్టు దగ్గరికి రాగానే లటుక్కున దాన్ని పట్టుకోని టకటకటక పైకి ఎక్కేసినాడు. వాడట్లా ఎక్కనాడో లేదో పులి వెంటనే ఈ గిలిగాడు మళ్ళా కిందికి దిగకముందే తప్పించుకోవాల అని అటూ యిటూ చూడకుండా రయ్యిన పారిపోయింది. అప్పన్నించి గిలిగాని భయంతో పులి, పులి భయంతో దొంగోడు మళ్ళా ఎప్పుడూ ఆ ముసల్దాని గొర్రెల దగ్గరికి పోలేదు.
***********
కామెంట్‌లు