కార్తికమాసం విశిష్టత- "కవిమిత్ర" శంకరప్రియ , శీల- సంచార వాణి:- 99127 67098
 ⚜️"కృత్తికా" నక్షత్రమున్న
 పౌర్ణమి తిథి కలది!
     "కార్తిక మాసం" అనగా
  ఓ సుమతీ! ఓజోమతి!
        (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
⚜️ చాంద్రమానం ప్రకారం.. కార్తిక మాసం ఎనిమిదవది! పౌర్ణమి తిథి నాడు.. "కృత్తిక" నక్షత్రం కల్గి యుండడం వలన; దీనికి "కార్తిక"మాసమని పేరు! ఇది.. శరదృతువు ఉత్తరార్థంలో వస్తుంది! ఈ మాసమంతా దీపోత్సవములు వైభవముగా జరుగు తాయి! 
     భక్తులందరూ సూర్యోదయముకు ముందే లేచి, కాలకృత్యములు తీర్చుకొని, స్నానము చేసి, దీపారాధన ఆచరిస్తారు! పిమ్మట, త్రికరణముల శుద్ధిగా.. అనగా.. మనసా, వాచా, కర్మణా . శుచిగా ఉండి, ఇష్టదైవరాధన కొనసాగిస్తారు
    🔆కార్తీకమాసంలో నెలరోజులు పర్వదినాలే! ఇది.. శ్రీశివ కేశవులకు ప్రీతికరమైనది! ఇందులో.. సోమవారములు, ఏకాదశులు, త్రయోదశులు, కార్తిక పౌర్ణమి...అత్యంత పవిత్రమైన పర్వదినములు! కనుక, భక్త మహాశయు లందరూ; యథాశక్తిగా ఉపవాసాలు, నక్తములు ఉంటారు! భక్తి ప్రపత్తులతో శివార్చన చేస్తారు! ఆ రోజులందు శైవ క్షేత్రములు ఆలయములు "శివ"నామ స్మరణతో, "పంచాక్షరీ" మంత్ర జపంతో.. మార్మ్రోగుతాయి!
⚜️శ్రీ మన్మహాలింగ స్వరూపుడైన, పరమేశ్వరునకు పంచామృతాలతో, వివిధ ఫలరసాలతో, నారికేళ జలముతో.. అభిషేకములు జరుగుతాయి! అదే విధంగా, బిల్వపత్రాలతో, పలురకాల పుష్పాలతో.. శ్రీస్వామి వారికి పూజ కొనసాగుతాయి! 
     ఈ విధంగా.. ఆచరించిన అభిషేకములు, అర్చనలు; చేసిన జపములు, దానములు.. మున్నగునవి, ఆరాధకులకు.. అధిక పుణ్యఫలితమును కలిగించు చున్నాయి! ఈ సందర్భంగా.. మనమంతా వెలిగించిన చిరు దీపములు.. ముక్తి పధమునకు మార్గమును చూపుచున్నాయి! అని, చెప్పడం అతిశయోక్తి లేదు!
 
🔱శ్రీశివ కేశవులకు ప్రీతిపాత్ర మైన కార్తికమాసం.. సకల మానవాళికి ఆయు రారోగ్యములను, యోగ క్షేమములను అనుగ్రహించు చున్నది! శ్రీశివ సంకల్పమస్తు!
 🚩 శార్దూలo వృత్తం 
    కార్తీకమ్మిది ఉన్నతమ్మగు కనంగా విష్ణువున్ సర్వదా
     ఆర్తింబాపుచు శంభుదేవుడును భక్తాళిన్ ముదమ్మొంద నీ
      కార్తీకమ్మున గాంచు చుండెదరు సత్కారుణ్య చింతామణుల్
      కర్తవ్యమ్ముగ ధ్యానమున్ సుమతితో కావింపగా మేలగున్
   
    [ రచన:- డా. శాస్త్రుల రఘుపతి., ]
         🔆🪷🔆
 🚩సీస పద్యము🚩
   దీపవిభాసితమై పవిత్రపు కార్తి 
కంబది వచ్చె నీ కాలమందు
     ప్రాభాతకాలాల పరిపూతభావాల
 పుణ్యనదీ స్నానమొనరు నిందు!
      హర హరా! శివ శివా! హరనామ గానాల
 నొక్కపొద్దుండుటే ఉచ్చమిందు!
     నిత్యోపవాసాల నియమైకమాసమై
 నిఖిల జీవులరక్ష నిలుచునిందు
         🚩తేటగీతి పద్యము
    సుందరేశుని కనుగొన సులభమిచట
 పార్వతీశుని కరుణకు పాత్రుడగుట
      మల్లికార్జున స్తుతులకు మార్గమిచటె!
ఆర్తి వేడుము జనులార! కార్తికాన!
     [ రచన:- రాయప్రోలు జగదీశచంద్ర శర్మ.,]

కామెంట్‌లు