న్యాయాలు -305
సందంశ పతిత న్యాయము
*****
సందంశము అంటే పట్టుకారు.పతిత అంటే పడిన వాడు,దిగిన వాడు,త్రోసిపుచ్చబడిన వాడు,ఆవమానితుడు, యుద్ధ పరాజితుడు,పాపి అనే అర్థాలు ఉన్నాయి.
పట్టుకారులో చిక్కుకున్నట్లు.దీనికి దగ్గరగా ఉన్న తెలుగు సామెత"అడకత్తెరలో పోక చెక్కలా అన్నట్లు".
అంటే అటూ ఇటుగా తేల్చుకోలేక విషమావస్థలో పడిపోవడం అన్న మాట.
పట్టుకారులో కానీ అడకత్తెరలో కానీ చిక్కిన పోక చెక్క, లేదా వస్తువు రెండు వైపుల నుండి నలిగి పోతుంది.దీనినే మన పెద్దవాళ్ళు మనుషులకు వర్తింప చేస్తూ చెప్పారు.
పట్టుకారు, అడకత్తెర అనే వస్తువులు లేదా పనిముట్లు నేటి తరానికి తెలుసా ?అంటే ... చాలా వరకు తెలియదనే చెప్పాలి.
పట్టుకారు:- ఇది స్వర్ణకారులు,కమ్మరి పని వారి ఇళ్ళలో కనిపిస్తుంది.కారణం వారి వృత్తికి ఇది చాలా అవసరమైన పనిముట్టు. దీనితో కుంపట్లోంచి, కొలిమిలోంచి, మూసలు,వేడి పాత్రలను, వస్తువులను తీయడానికి,అలాగే నిప్పు కణికలను, పట్టుకొనేందుకు ఉపయోగిస్తారు.ఆయా ఇళ్ళలోని స్త్రీలు కొంచెం చిన్న సైజులో ఉన్న వేడిగా వుండే వంట పాత్రలను స్టౌ మీద నుండి తీయడానికి కూడా వాడుతుంటారు.
"ఇక 'అడకత్తెర':- అడకత్తెర పోకచెక్కలను ముక్కలు చేయడానికి లేదా కత్తిరించడానికి ఉపయోగించే కత్తెర.
తెలుగు వారి వివాహ వేడుకలో ఈ అడకత్తెరకు ఓ ప్రత్యేక స్థానం ఉంది.పెళ్ళి కుమారునికి వివాహానికి ముందు వధువు తరఫు వారు అడకత్తెర ఇస్తారు. దానిని చేతిలో పట్టుకునే వివాహ మండపానికి వరుడు వస్తాడు. అలా పెళ్ళి తంతు పూర్తి అయ్యేవరకు వరుడి దగ్గరే వుంటుంది.
కారణం ఆ కాలంలో చాలా కుటుంబాల్లో తాంబూలాలు వేసుకునే అలవాటు వుండేది కదా!.అందువల్ల దీనిని తమలపాకులు,వక్క కత్తిరించడానికి ఇచ్చే వారేమో! ధనవంతులు వెండి అడకత్తెర చేయించి ఇచ్చే వారు.
అయితే కొందరు సరదాగా ఇక "మన వాడి బతుకు అడకత్తెరలో పోకచెక్కేరా!" అని ఆట పట్టిస్తూ కూడా అనే వారు.
అవండీ పట్టుకారు, అడకత్తెర పనిముట్ల ఉపయోగాలు,వాటికి సంబంధించిన విశేషాలు .
ఇలా ఎటూ తేల్చుకోలేక, సమస్య నుండి తప్పించుకోలేక బాధ పడుతూ విషమ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఈ "సందంశ పతిత న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
అటూ ఇటూ ఉన్న వ్యక్తులు బాగా అయిన వారు లేదా కావలసిన వారు, బంధాన్ని తెంచుకోలేని వారు అయినప్పుడు వ్యక్తులకు ఇలాంటి స్థితి వస్తుంది.దానిని 'అడకత్తెర బతుకు' అనీ, అటూ,యిటూ కూడా బాధలకు గురయ్యే బతుకు అని అర్థం.
ఇలాంటివి ఎక్కువగా కుటుంబాల్లో ఎదురవుతుంటాయి.మగవారైతే అటు తల్లి ఇటు భార్య లేదా చెల్లెలు మరియు భార్య...వారిద్దరి మధ్యలో సఖ్యత ఎప్పుడైతే కొరవడుతుందో ఇక అప్పటి నుండి మొదలవుతుంది.అటుభార్య వైపు మొగ్గు చూపితే తల్లికి, చెల్లికి బాధ.ఇటు తల్లి, చెల్లి వైపు మొగ్గు చూపితే భార్యకు కోపం.వారి మధ్య అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతుంటాడు.ఆలాంటి వాడిని చూసి జాలిపడుతూ" పాపం! వాడు అడకత్తెరలో పోక చెక్కయ్యాడు"అంటుంటారు.
ఇటు కుటుంబం అటు ఉద్యోగం-రెండింటిని సంభాళించుకోలేక, కుటుంబ అవసరాల రీత్యా ఉద్యోగం వదులుకోలేక మధ్యలో పోక చెక్కలా నలిగిపోయే ఆడవాళ్ళు ఎందరో వున్నారు.అయినా ఎందుకో మరి! ఆడవాళ్ళకి ఈ న్యాయాన్ని ఉపయోగించరు.
మొత్తానికి "సందంశ పతిత న్యాయము" అంటే ఏమిటో అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్న వారి బాధ ఎలా వుంటుందో ఈ పాటికి మనందరికీ అర్థమై వుంటుంది కదండీ! పగ వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితులు రావద్దని కోరుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి