కవ్వింపులు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఆమె రమ్మంది
అడుగుముందుకెయ్యలా
సైగలు చేసింది
చూడనట్టునటించా

పక్కకు పిలిచింది
పోలా
పొంకాలు చూపింది
పరికించలా

పరిమళం చల్లింది
పీల్చలా
పకపకా నవ్వింది
ప్రతిస్పందించలా

పరిహాసమాడింది
పట్టించుకోలా
ప్రవరాఖ్యుడువా అన్నది
పలకలా

ప్రేమ ఒలకబోసింది
భీష్మించుకొనికూర్చున్నా
వలపువలను విసిరింది
చిక్కకుండాతప్పించుకున్నా

కోరచూపు చూచింది
కళ్ళుమూసుకున్నా
కేకలు వేసింది
చెవులుమూసుకున్నా

కవీ అనియన్నది
కళ్ళుతెరిచా
కలము పట్టమంది
చేతికితీసుకున్నా

కాగితం తీయమంది
బయటకుతీశా
కవిత రాయమంది
వ్రాశా

కమ్మగా పాడమంది
పాడా
పరవశించి పోయింది
పులకరించా

చెయ్యి చాచింది
చేతులుకలిపా
వాగ్దానం చేయమంది
మాటిచ్చా

రోజూ రమ్మంది
సరేనన్నా
నిత్యమూ రాయమంది
ఒప్పుకున్నా

పత్రికలకు పంపమంది
తలనూపా
పాఠకుల అభిమానుడివికమ్మంది
ప్రయత్నిస్తానన్నా

పుస్తకం ప్రచురించమంది
సమ్మతించా
కలలోకి వస్తానన్నది
అంగీకరించా

కవ్వింపులు వీడనన్నది
స్వాగతమన్నా
టాటాబైబై చెప్పింది
సెలవుతీసుకున్నా

============================

నన్ను
అపార్ధంచేసుకోకండి
ఆమె
విరబూచిన విరి

నన్ను
దూషించకండి
ఆమె
కులుకుల కలికి

నన్ను
తిట్టకండి
ఆమె
కవితా కుమారి

నన్ను
ప్రేలాపిననుకోకండి
నేను
కైతలల్లే భావకవిని

నన్ను
మాటకారిననుకోకండి
నేను
ప్రకృతి ప్రేమికుడిని

నన్ను
కలలరాజుననుకోకండి
నేను
కల్పనలుకూర్చే కవిరాజుని

ఆమెను
ఆటబట్టించాననుకోకండి
ఆమె
నామనసుదోచిన మానిని

కామెంట్‌లు