సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -332
సుధార్ధ్ర హరిద్రా న్యాయము
******
సుధ అంటే అమృతము, పాలు, సున్నము,జెముడు మొక్క,ఇటిక అనే అర్థాలు ఉన్నాయి.
ఆర్ధ్ర అంటే తడిసినది,మెత్తనిది.హరిద్రా అంటే పసుపు.
 సున్నముతో తడిచిన పసుపు ఎర్రబడుతుంది. భిన్న భిన్న పదార్థముల కలయిక వల్ల కొత్తరకాలు పుట్టునని ఈ "సుధార్ధ్ర హరిద్రా న్యాయము" యొక్క అర్థము.
ఇది పసుపు సున్నం తడిసినప్పుడే కాకుండా కొన్ని రంగుల కలయిక వల్ల కొత్తరంగులు ఏర్పడటం రంగులను ఉపయోగించి చిత్రాలు గీసే వారికి చాలా బాగా తెలుస్తుంది.
అలాగే ప్రయోగ శాలలో  కొన్ని రకాల రసాయన మూలకాలను కలపడం వల్ల కొత్తవి ఏర్పడుతాయని భౌతిక, రసాయన శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
అలా రంగులు,రసాయనాలే కాదు భిన్న వర్గాల సంస్కృతులు, సాంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు కలగలిసినప్పుడు కొత్త రకమైనవి ఏర్పడటం మన సమాజంలో, దేశంలో ప్రపంచంలో చూస్తూనే ఉన్నాం.
ఇలా ఈ న్యాయమును మన దేశానికి వర్తింప చేసి చూద్దాము.
మన దేశం భారతదేశం . ఇక్కడ భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉండటం వల్ల ఉప ఖండం అని పిలుస్తున్నారు,  కేవలం భౌగోళికంగా, భౌతికంగానే  కాదు.విభిన్నమైన సంస్కృతుల సమాహారం కూడా. భిన్న మతాలు, సంస్కృతీ, సంప్రదాయాలకు,ఆచార వ్యవహారాలకు నెలవు .ఇలా ప్రత్యేక భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రక లక్షణాల కారణంగా భారత దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం గల ఉపఖండమని అంటారు.
 ఇలా భౌగోళిక స్వరూపాలు వేరైనా ,అనేక మతాల వారు నివసిస్తున్నా ,సాంస్కృతిక సాంప్రదాయాల్లో భేదాలు, చారిత్రక లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ భారత దేశంలోని ప్రతి వ్యక్తి భారతీయుడిగా పిలవబడతాడనేది అక్షర సత్యం కదా!.
ఇవన్నీ ఎందుకు అసలు విషయంలోకి వద్దాం అంటారా! అక్కడికే వస్తున్నాను.
ఇలా మన దేశంలో ఒక్కొక్క  కులానికి మతానికి , వర్గానికి సంబంధమైన సంస్కృతి సంప్రదాయాలు  వివిధ రకాలుగా ఉన్నప్పటికీ ఆయా వాటిల్లోని  మంచిని గ్రహించి ఎలాంటి  యిబ్బందులకు లోనుకాకుండా కలిసి మెలిసి జీవించడమనే సరికొత్త సంస్కృతి ఉదయించింది. ఆత్మీయమైన వరుసలతో పిలుచుకోవడం,సుఖ దుఃఖాలను పంచుకోవడం జరుగుతున్నది.
ఇలా తినే ఆహార పదార్థాల దగ్గరనుంచి మొదలుకొని కట్టూ ,బొట్టూ ఆచార వ్యవహారాల్లో  నచ్చినవి ఆచరించడమనే  మార్పు వచ్చింది.
ఆ విధంగా కులాలు, మతాల జీవన విధానాలు, ఆచారాలు ,అలవాట్లలో ఎన్నో ఆదాన ప్రదానాలు జరుగుతున్నాయి.
ఆదాన ప్రదానాలు అంటే మరేమిటో కాదు ఇచ్చి పుచ్చుకోవడం అన్నమాట. ఇలా కేవలం పై వాటికే పరిమితం కాలేదు. భాషా పరంగా కూడా ఆయా భాషా పదాలను ఉపయోగించి మాట్లాడటం మనందరికీ తెలిసిందే.
ఇదండీ "సుధార్ధ్ర హరిద్రా న్యాయము" అంటే  ఈపాటికి కూలంకషంగా అర్థమయ్యే వుంటుంది.
 ప్రపంచీకరణ నేపథ్యంలో వసుధైక కుటుంబ భావన పెరగడంతో  "సుధార్ధ్ర హరిద్రా న్యాయము" వలె భిన్న సంస్కృతులు, సాంప్రదాయాల సమ్మిళితమై  మానవ జాతి తమ మనుగడకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా, ఆనందంగా  గడుపుతోంది.మనం కోరుకునేది కూడా అదే కదండీ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు