అనన్య భక్తి- సి.హెచ్.ప్రతాప్
 భగవంతుడిని నిరంతరం గుర్తుంచుకొని, సదా స్మరించే వారిని నిత్య భక్తులంటారు. అలా కాకుండా భగవంతుడిని కష్టాల సమయంలోనే, కోరికలు తీర్చేందుకు మాత్రమే గుర్తుంచుకొని, ప్రార్ధించేవారిని అవకాశపు భక్తులని అంటారు. భగవంతుడిని కోరికలు తీర్చడం కోసం లేదా, కష్టాలు తీర్చమని ప్రార్ధించడం తప్పు కాదు ఎందుకంటే భగవంతుడు మనకు తల్లి లేదా తండ్రి వంటి వాడు. మన శ్రేయస్సు కోసం ఆయనను తప్ప ఇంకెవరిని అడగగలం? అయితే కేవలం కోరికల మూట కోసం మాత్రమే ఆయనను ప్రార్ధించడం తప్పు. అది పూర్తిగా అవకాశవాదం అవుతుంది.
అందుకే భగవంతుడు నన్ను, శ్రద్ధా విశ్వాసాలతో సదా స్మరించండి. నిస్వార్ధంగా నన్ను సేవించండి.  మీకు కళ్యాణం, శ్రేయస్సు ప్రాప్తిస్తుంది.  నిత్యం నన్ను స్మరణ చేసేవారిని నేను తప్పక ఉద్ధరిస్తాను, సదా వారి వెంట వుండి కాపాడుతాను అని అభయం ఇచ్చారు. కాబట్టి ఎవరు భగవంతుడిని సదా స్మరిస్తారో, స్వార్ధం లేకుండా చింతిస్తారో వారికే భగవంతుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది.  దీనిని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో
అనన్య చింతయోమాం ఏ జన: పర్యుపాసతే
తేషాం నిత్యాభి యుక్తానాం యోగ క్షేమం వహామ్యహం
అని అద్భుతంగా సెలవిచ్చారు. అంటే ల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు. అలా నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారికి, వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను అని అర్ధం.  
మన సొంత స్వేచ్చా చిత్తముతో ప్రవర్తిస్తూ, మన కర్మలను చేసేది మనమే అని అనుకున్నప్పుడు, మన సొంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉన్నప్పుడు, భగవంతుడు తన కృపని ప్రసాదించడు.  మనం పాక్షికంగా ఆయనకు శరణాగతి చేసి, పాక్షికంగా భౌతిక ఆధారాలపై ఆధారపడినప్పుడు, భగవంతుడు కూడా తన కృపను పాక్షికంగా ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా సమర్పించుకుంటామో, 'మామేకం శరణం వ్రజ' , భగవంతుడు తన పూర్తి అనుగ్రహముని ప్రసాదించి, మనకు ఉన్నవాటిని సంరక్షిస్తూ, మనకు లేని వాటిని సమకూరుస్తూ, మన పూర్తి బాధ్యతను తను స్వీకరిస్తాడు.

కామెంట్‌లు