భక్తులే ధన్యజీవులు- "కవి మిత్ర" శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:- 99127 67098
  🪷భవానీపతి భర్గుని
       భక్తి శ్రద్ధల సేవించు
       భక్తులే ధన్యజీవులు!
       శివా నమో! నమః శివా!     
             (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
🙏భక్తమహాశయులు.. భక్తి శ్రద్ధలతో కావించు ..శ్రీశివనామ కీర్తనము.. జిహ్వకు సంబంధమైనది. అది.. వాచిక కర్మ!  శ్రీశివదర్శనము.. నేత్రములకు సంబంధమైనది; శ్రీశివార్చనము.. హస్తములకు సంబంధమైనది. అవి, రెండు.. కాయికములైన కర్మలు. అట్లే, శ్రీశివమంత్ర జపము.. చిత్తమునకు సంబంధమైనది! అది.. మానసికమైన కర్మ!
🙏ఎల్లప్పుడు శివనామమును నుచ్చరించుచుండు నాలుకయే నాలుక! ఎల్లవేళల శివుని విశ్వరూపమును చూచుచుండు కన్నులే కన్నులు! ప్రతిదినము శివుని లీలామూర్తులను పూజించుచుండు చేతులే చేతులు! నింతరము పరమేశ్వరుని ధ్యానించుచుండు, భక్తుడే కృతార్ధుడు! అని, ఆదిశంకరులు సందేశమిచ్చు చున్నారు!
🔱 సారసనా తే నయనే 
      తావేవ కరౌ, స ఏవ కృతకృత్యః!
      యా యే యౌ యో భర్గం
      వదతీక్షేతే సదార్చతః స్మరతి!!
            ( శ్రీశివానంద లహరి.. 94వ శ్లోకము)
            🪷🔆🪷
 👌పరమ శివుని.. మానసిక.. వాచిక.. కాయిక.. కర్మణా త్రికరణశుద్ధిగా సేవించు భక్తులే.. ధన్యాత్ములు! వారి జన్మమే చరితార్థమైనది! అని, జగద్గురు శంకర భగవత్పాదులవారు వివరించు చున్నారు!
         🪷🔆🪷
       🚩కoద పద్యము
    అదెనాలుక, యదె కన్గవ 
    యదె కరయుగ, మతడె ధన్యులందున్ ధన్యుం (డు),
     డెది శివు బలుకునొ, కనునో 
     యెది పూజిoచెడినొ, యెవ్వడెంచును భక్తిన్!!
         (రచన:- శ్రీ బలిజేపల్లి లక్ష్మీ కాంత కవి.,)
          🔆🪷🔆
        🚩ఉత్పల మాల
     ఏ యది భర్గు నెప్డు వచియించునొ, యద్దియె జిహ్వయౌ జుమీ; 
    ఏ యవి భర్గు జూచునొ, యవే కనులై చను; భర్గు నర్చలం 
    బాయక యేది చేయు, నదె పాణి యుగమ్మగు; భర్గు నేడు శ్ర
      ద్ధాయతి మై దలంచు మది, నాతఁడె గా కృతకృత్యుడై తగున్!!
       ( రచన:- డా. జొన్నలగడ్డ మృత్యుజయ రావు.,)
🕉️ నమఃశివాయై నమఃశివాయ!

కామెంట్‌లు