హృదయకైలాస వాసుడు - సాంబశివుడు- "కవి మిత్ర" శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:- 99127 67098
  🙏శ్రీమన్మహేశ్వర! హర!
        నాదు హృది కైలాసము!
        నీదు కేళీ విలాసము!
        శివా నమో! నమః శివా!
            ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
  ⚜️సాంబ సదాశివుడు.. శ్రీశైలం, అరుణాచలం, హిమవత్పర్వతము.. మున్నగు గిరిశిఖరము లందు.. ఆరాధ్య దేవతా మూర్తులుగా సేవించబడు చున్నాడు! అట్లే, సమస్త జీవులయొక్క హృదయమను, కైలాసము లందు కొలువుదీరి యున్నాడు!
🔱శివా! భవానీ సనాథా! ఈ భక్తుని చిత్తము మిక్కిలి కఠోరముగా నుండును! మిగుల కోమలమైన నా పాదములతో, దానియందు సంచరించుట యెట్లని; మీరు సందేహింప పనిలేదు! అట్లయినచో కఠినమగు పర్వత శిఖరముల మీద పార్వతీ సమేతులై; మీరే విధంగా నివసించు చున్నారు? అని, పరిప్రశ్న వేయుచున్నారు, జగద్గురు శంకర భగవత్పాదుల వారు!
🙏ప్రార్ధన శ్లోకము
     అతి మృదులౌ మమ చరణా 
     అతి కఠినం తే మనో భవానీశ!
     ఇతి విచికిత్సాం సంత్యజ 
     శివ! కథమాసీ ద్గిరౌ తథా ప్రవేశః ||
          ( శ్రీ శివానంద లహరి.. 95.వ. శ్లోకము )        
 🙏 ఓ కైలాసవాస! శివా! సంశయములను విడనాడి; మా మానస వీధిలో విహరింపుము స్వామి! అని, జగద్గురు ఆదిశంకరులు.. ఆ భక్తవశంకరుడైన, శంకర భగవానుని అభ్యర్థించు చున్నారు.
              🔆🪷🔆
          🚩తేట గీతి పద్యం
       మృదుల మృదులంబు లగు నాదుపదము లేడ?
       పరుష పరుషంబయిన నీదు భావమేడ?
      యనిన నది చెల్లునయ్యా! యట్లైన నీవు
      కొండ యందెట్లు తిరిగెదు కొండరేడ! 
            [రచన:- బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి.,
             🔆🪷🔆
        🚩ఉత్పల మాల
     నాదు పదంబులున్, మృదుల నవ్య సుపల్లవ సుందరంబు లౌ,
     నీదు హృదంతరంబు, ఘన నిష్ఠుర మౌ,నను సందియంబు నే 
    యాదర మొప్ప వీడుమ! యుమాధిప! యట్లగుచో శివా! యెటుల్
     మేదుర శీతశైలమున మేలిమితో వసియించు చుందువో!
          [మధురకవి, దేవులపల్లి చెంచు సుబ్బయ్య శర్మ.,]
🕉️ నమఃశివాయై! నమఃశివాయ!

కామెంట్‌లు