బస్సు - - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నేను బస్సును ప్రేమిస్తున్నాను
ఎందుకో తెలుసా?
బస్సంటే నాకిష్టం,బస్సంటేనే నాప్రాణం
పూలనీ,పాలనీ,కూరల్నీ,కాయల్నీ
సమంగా మోసుకెళుతుంది
పొద్దున్నే బిలబిలలాడుతూ బయలుదేరిన
మల్లెమొగ్గలను స్కూళ్ళల్లో దింపుతుంది
ఉద్యోగులనూ వారి స్థానాల్లో 
చక్కగా దిగబెడుతుంది
అతిథులను ఆదరించి,సీట్లిచ్చి గౌరవించి
వారు కోరినచోటకల్లా భద్రంగా చేర్చుతుంది
నేను బస్సులో కూర్చున్నప్పుడల్లా
మా అమ్మఒళ్ళో కూర్చున్న అనుభూతి
నేను బస్సులో ఊపిరిపీల్చుకున్నప్పుడల్లా
మా అమ్మముఖంలో ముఖంపెట్టి 
శ్వాసించిన అనుభూతి
బస్సుపొగ పీల్చినప్పుడల్లా
నాన్నను ముద్దుపెట్టుకున్నప్పుడు
నేను శ్వాసించిన అనుభూతి
పాడైనబస్సును చూసినప్పుడల్లా
రోగాలతో రోజులు వెళ్ళదీస్తున్న
మా బంధువే గుర్తొస్తాడు
అల్లరిమూకల చేతుల్లో గాయపడిన
బస్సును వీక్షించినప్పుడల్లా
పోలీసుల లాఠీఛార్జిలో దెబ్బలుతినీ,తలలుపగిలీ,
ఎముకలువిరిగీ,సోలిపోయిన 
ఉద్యమకారుల్నే దర్శిస్తాను
కాల్తున్నబస్సును చూసినప్పుడల్లా
చితిలో టైర్లుపెట్టి మరీ
మా అమ్మశవాన్ని కాల్చేస్తున్న దృశ్యం చూస్తాను !!!
*********************************

కామెంట్‌లు