సుప్రభాత కవిత - బృంద
పచ్చని మరకతాలు 
పొదిగిన ఆభరణాన్ని
ధరించి ధరిత్రి ధగధగా
మెరిసిపోతుంటే....

వృక్షాలు.మొక్కలూ 
తీగలూ పొదలూ
మానవాళి క్షేమం కోసం 
మోస్తూ  సంతోషపడుతుంటే...

సాగే  మేఘాలను ఆగమని
చల్లని గాలులు పంపి
జల్లు కురిపించి  ఒడిసిపట్టి
కనుమదారుల కడలికి పంపుతుంటే...

రకరకాల రంగుల పువ్వులు
చిన్ని మనసులతో  తావిగా
సంతోషాన్ని పంచుతూ
భువిని దివిగ మారుస్తుంటే....

లేత కిరణాలుగా తాకే
నీ అనుగ్రహ వీక్షణాలు 
తిమిరపు చేతుల్లో చిక్కిన
వసుధకు సుధలు కురిపిస్తుంటే...

నీ కరుణకు కనులు చెమరించి
దోసిలిలో పోసిన దీవెనలు
ఆణిముత్యాలై అలరింప
ఎద సడే నీకు స్వాగతమంటుంటే

మాటలకు అందని మౌనమే
నీకు మంత్రాక్షరాలుగా
నివేదిస్తున్నా ప్రభూ..🙏
కానుకగా ఇచ్చిన వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు