సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -339
సూచీ ముఖ న్యాయము
*****
సూచీ ముఖము అంటే అభినయ హస్త విశేషము, బాణము,పక్షి విశేషము,సూది మొన అనే అర్థాలు ఉన్నాయి.
"తనకు మాలిన ధర్మం చేయకూడదనే" అర్థంతో కూడిన ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.మరి ఈ న్యాయము యొక్క కథా కమామీషు ఏమిటో చూద్దాము.
 ఒకానొక  అడవిలో కొన్ని కోతులు చలి బాధను తట్టుకోలేక నిప్పు రవ్వలు అనుకొని భ్రమతో గురివింద గింజలను ఏరుకుని వచ్చి ఒక చోట రాశిగా పోసి చలి కాగడం మొదలు పెట్టాయి.కానీ వాటి వల్ల చలిబాధ తీరలేదు ( ఎలా తీరుతుంది.అవి కేవలం చిన్న నిప్పు కణాల్లా మెరుస్తున్న గురివింద చెట్టు గింజలు కదా!).ఆ కోతులకు చలి బాధ మరింత ఎక్కువ కాసాగింది.వణికిపోతున్నాయి.
అదే సమయంలో సూచీ ముఖము అనే ఓ పక్షి అటువైపుగా పోతూ వాటి అవస్థను, చలికాగేందుకు అవి చేస్తున్న ప్రయత్నాలను చూసింది. వాటి అమాయకత్వం, మూర్ఖత్వానికి జాలిపడుతూ "ఓ వానరములారా! అవి నిప్పు రవ్వలు కాదు.గురువింద గింజలు. వాటి వల్ల మీకు చలి తగ్గదు.అదిగో ! ఆ కనిపించే గుహలోకి వెళ్ళండి.అక్కడ వెచ్చగా వుంటుంది.మీ చలి బాధ శాంతిస్తుంది."అని చెప్పింది.
సూచీ ముఖము చెప్పిన మాటలు వినకుండా  కోతులు'నీ మొహం! నీకేం తెలుసు? అని వెక్కిరించాయి.
"అయ్యో! చెప్పింది అర్థం చేసుకోరేం. మీరిలా చేస్తే చలి బాధ తగ్గదు. నా మాట విని వెళ్ళండి." అంది  సూచీ ముఖము చెప్పిన హితవును అర్థం చేసుకోకుండా  కోతులన్నీ కోపంతో మూకుమ్మడిగా లేచాయి.
"నీవా మాకు బుద్ధి చెప్పేది? అసలు నీకు మా ఊసెందుకు? అంటూ గట్టిగా అరుస్తూ ఆ సూచీ ముఖముపై బడి కొట్టి చంపేశాయి.
ఇప్పుడు తెలిసిపోయింది కదండీ! ఎదుటి వారు మూర్ఖత్వంతో ఉన్నారని ఏ మాత్రం అనుమానం వచ్చినా వారి జోలికి పోకుండా ఉండటమే శ్రేయస్కరమని. "వాళ్ళు చెబితే వినరు. ఒంట బుట్టదు." "మంచికి పోతే చెడు ఎదురైనట్లు"  ఆ సూచీ ముఖము పక్షికి ఎదురైనట్లు చేదు అనుభవం మనకూ ఎదురవ్వొచ్చు.
ఇదే విషయాన్ని స్వయంగా జీవితానికి కూడా అన్వయించుకోవాలని "తనకు మాలిన ధర్మం చేయకూడదు" అని చాణక్యుడు సైతం చెప్పాడు.
ఇక చిన్నయ సూరి గారు రాసిన పంచతంత్ర కథల్లో "కోతి దుంగ" కథ దీనికి సంబంధించిన ఓ చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కొందరు వడ్రంగులు దేవాలయం బాగుచేయడానికి వెళ్తారు.అక్కడ పాడయిపోయిన దూలాల స్థానంలో కొత్త దూలాలను పేర్చడానికి,అందు కోసం దూలాలను తయారు చేసేందుకు ఒక పెద్ద దూలాన్ని కోస్తూ దానిని మధ్యకు చీలే విధంగా అక్కడక్కడా మేకులు కొడతారు.ఇదంతా అక్కడికి తరచూ వచ్చే కోతుల గుంపులోని ఒక కోతి ఎంతో శ్రద్ధగా గమనిస్తుంది.
ఆ వడ్రంగులు భోజనం కోసం వెళ్ళింది చూసి గబగబా కిందికి వస్తుంది .వారిలాగే రంపంతో దూలాన్ని కోయడానికి ప్రయత్నం చేస్తుంది.అంతటితో ఊరుకోకుండా వాళ్ళు దూలానికి మధ్యలో కొట్టిన మేకును పట్టుకొని గట్టిగా లాగుతుంది.అప్పటికే దాని తోక వాటి మధ్యలో ఉండటం వల్ల మేకు తీయడంతో అందులో గట్టిగా ఇరుక్కుపోతుంది. అది  బయటికి రాక బాధతో విలవిలలాడుతూ చివరికి ప్రాణాలు కోల్పోతుంది.
అలా మూర్ఖత్వంతో తనకు మాలిన పని చేయడం వల్ల కోతి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంది.
కాబట్టి మనమూ కోతిలా మూర్ఖత్వంతో ప్రవర్తించనూ కూడదు.అలాగే ఎదుటి వారు ఎలాంటి వారో విజ్ఞతతో గమనిస్తూ, వివేకంతో తప్పుకోవాలి.
ఇదండీ! "సూచీ ముఖ న్యాయము" మనకు చేసిన నీతి బోధ.కాబట్టి దీనిని సదా గమనంలో పెట్టుకొంటే  మంచిది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు