కాలం విలువ;- పొర్ల వేణుగోపాల రావు, టీచర్, ఎల్లారెడ్డి పేట
(ప్రక్రియ: రుబాయిలు)


(1)
సృష్టిలోన విలువైనది తిరిగిరాని కాలమోయి!
మరలమరల చూడలేవు! మరలిరాని కాలమోయి!
గడచినాక విలపించకు ఘొల్లుమనుచు గోపాలా!
వినకనీవు విలపించిన వెనుకరాని కాలమోయి!

(2)

కరుగుచున్న ప్రతి నిమిషపు విలువజూడ బంగారమె!
కష్టపడిన ప్రతీక్షణం ఫలముగూడ బంగారమె!
అణువణువూ శ్రమియించగ అపరంజియె గోపాలా!
తనువోడ్చిన చెమట చుక్క విలువగూడ బంగారమె!

(3)

ఏరువాక నడిపించగ ముక్కాలపు పంటపండు!
రేయిబవలు శ్రమియించగ శృంగారపు పంటపండు!
శ్రమజీవన సౌందర్యము నెఱుఁగవోయి గోపాలా!
కాలమంత కరిగించగ బంగారపు పంటపండు!

(4)

గెలుపోటములకు మధ్యన భేదమనగ ఒక్క క్షణము!
ఒకటి రెండు స్థానాలకు వ్యవధియనగ ఒక్క క్షణము!
ఘడియలోన నీదు భవిత మార్పుజెందు గోపాలా!
చావు బ్రతుకులకు మధ్య విరామమనగ ఒక్క క్షణము!

(5)

బీడువంటి జీవితాల పండించును ఈ కాలము!
వృథాజేయ నీ బ్రతుకును మండించును ఈ కాలము!
క్షణమెంతగ విలువైందో గ్రహియించుము గోపాలా!
అర్థమైన అమృతాలను పొంగించును ఈకాలము!
********


కామెంట్‌లు