సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -363
హస్తి మశక న్యాయము
******
హస్తి అనగా ఏనుగు.మశక అనగా దోమ, దేహము విరియు రోగము అనే అర్థాలు ఉన్నాయి.
 ఏనుగుకు, దోమకూ అసలు పోలికే వద్దు ."ఏనుగెక్కడ, దోమ ఎక్కడా" ఏనుగు ఏనుగే దోమ దోమే అనే అర్థంతో ఈ న్యాయము చెప్పబడింది.
 మరి ఈ  రెండింటికి సంబంధించిన వివిధ విషయాలు,వివరాలు తెలుసుకుందాం.
ఏనుగుకూ తొండం వుంటుంది. దోమకూ ఓ చిన్న తొండం వుంటుంది.అయినప్పటికీ  దోమ  ఏనుగు కాలేదని  మన తెలుగులో ఓ సామెత ఉంది.అదే "ఎంత తొండమున్నా దోమ ఏనుగు కాదు".
అది అందరికీ తెలిసిందే కదా అందులో ప్రత్యేకత ఏముందని అనిపించవచ్చు కానీ అందులోని నిగూఢమైన అర్థాన్ని చూద్దాం.
 ఇక్కడ ఏనుగు మంచి వ్యక్తికి,దోమ దుర్మార్గుడికి ప్రతీకగా తీసుకోబడింది.అయితే మంచివారికి, చెడుకు అంటే  దుర్మార్గులకు మధ్య ఏవో ఒకటి,రెండు పోలికలు కనిపిస్తూ వుండొచ్చు.అలా కనిపించినంత మాత్రాన దుర్మార్గులు ఎప్పుడూ మంచివారితో సమానులు కారు. కాలేరు  అని అర్థము.
అవును కదా ! ముందుగా  ఏనుగు గురించి తెలుసుకుందాం. ఏనుగులో బోలెడు మంచి లక్షణాలు ఉన్నాయి.మచ్చిక చేసుకుంటే  నమ్మిన బంటులా వుంటుంది. ప్రాచీన కాలము నుండి ఏనుగులను మచ్చిక చేసుకొని ఐశ్వర్యానికి గుర్తుగా మాత్రమే కాకుండా వివిధ పనులు చేయించుకోవడంలోనూ,యుద్ధాలలోనూ ఉపయోగించుకునే వారు.గొప్ప కవులను పండితులను  గజారోహణము చేయించి, గండపెండేరం తొడిగి సన్మానించేవారు.దేవస్థానములలో కూడా దేవుళ్ళ ఊరేగింపులలో ప్రత్యేకంగా ఏనుగు సేవలను ఉపయోగించడం మనకు తెలుసు.
అంతే కాదు హిందువులు తాము ఏపని తలపెట్టినా విఘ్నాలు తొలగి పోవాలని గజాననుడైన  విఘ్నేశ్వరుడిని  ముందుగా ప్రార్థించడం అందరికీ తెలిసిందే.
మరి దోమలో కాగడా పెట్టి వెతికి చూసినా ఒక్కటంటే ఒక్క మంచి లక్షణమైనా కనబడుతుందా? అస్సలు కనబడదు.అసలు ఇప్పుడు వస్తున్న వ్యాధులన్నీ ఎక్కువగా  దోమ కాటు వల్లనే వస్తున్నాయి.
దోమ  ఎంత ప్రమాదకరమైనదో దాని వల్ల వచ్చే రోగాలే చెబుతాయి. మలేరియా, మెదడు వాపు,డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా మొదలైన జబ్బులన్నీ దోమల వల్లే వస్తాయి. ప్రపంచంలో ఎక్కువ మంది దోమ కాటు వల్లనే చనిపోతున్నారని సర్వేలో తేలిందట.
' అందుకే ఏనుగు ఏనుగే ''దోమ దోమే ' అన్నాడు వేమన‌.ఆ పద్యాన్ని చూద్దామా...
 "కుక్క గోవు కాదు కుందేలు పులి కాదు/ దోమ గజము గాదు దొడ్డదైన/ లోభి దాత కాడు లోకంబు లోపల/ విశ్వధాభిరామ వినురవేమ!"
ఎంత భారీ శరీరము ఉన్నా (తొండము వున్నా) దోమ ఏనుగు కాలేదు.ఎంత సౌమ్యంగా ఉన్నా మొరిగే కుక్క ఎప్పుడూ పాలిచ్చే ఆవు కాలేదు.ఎంత గంభీరంగా ఉన్నా కుందేలు పులి కాలేదు.అలాగే లోభి ఎప్పుడూ దాత కాలేడు అని అర్థము.అంటే ఇక్కడ దోమను లోభితో పోల్చడం  జరిగింది.
 ఇలా  ఏనుగునూ దోమనూ  పోల్చి చూస్తే మంచికీ చెడుకూ  ఉన్నంత తేడా వుందని ఈ హస్తి మశక న్యాయము ద్వారా మనం తెలుసుకోగలిగాం.
మనమూ ఏనుగంత గొప్ప మనసుతో జీవిద్దాం‌.అందరి హృదయాలలో మంచివారిగా ముద్ర వేసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు