ప్రధానోపాధ్యాయుడి వితరణ - నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరకుల పంపిణీ

 కాలశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆదివారం మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. మండల కేంద్రంలోని చెంచు సామాజిక వర్గానికి చెందిన ఇందుల లక్ష్మణ్ గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ యజమాని చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వారి దీనస్థితిని గమనించిన కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య స్పందించారు. లక్ష్మణ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం తన భార్య ఈర్ల సునీతతో కలిసి, మృతుని భార్య ఇందుల శాంతమ్మకు 30 కిలోల బియ్యం, నూనె, ఉప్పు, పప్పు దినుసులు, కూరగాయలను అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. గతంలో ఈర్ల సమ్మయ్య దంపతులు చెంచు సామాజిక వర్గానికి చెందిన నిరుపేద పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. మరెందరో నిరుపేద కుటుంబాలకు వారికి తోచిన సహాయం చేస్తూ ఆదుకున్నారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ సామాజిక సేవ చేయడం వల్ల అంతులేని ఆత్మసంతృప్తి మిగులుతుందని, ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేసే గొప్ప గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈర్ల సమ్మయ్య, ఈర్ల సునీత, అనుముల రమేష్, తూండ్ల కిరణ్, ఓదెలు, గ్రామస్తులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు