సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -385
అజాత పుత్ర నామోత్కీర్తన న్యాయము
*******
అజాత అనగా పుట్టని వాడు.పుత్ర అనగా కొడుకు, కుమారుడు.నామ అనగా పేరు .ఉత్కీర్తన అనగా పొగడుట.
పుట్టని కొడుకు గుణములను పొగడుకొన్నట్లు."ఆలు లేదు చూలు లేదు.కొడుకు పేరు రామలింగం అన్నట్లు."
అంటే ఏమీ లేకుండా ఊహించుకొని గాలిలో మేడలు కట్టేవారిని గురించి చెబుతూ ఇలాంటి సామెతను వాడుతారు.
ఓ వ్యక్తి తనకు పెళ్ళయినట్టు, భార్య గర్భవతి అయినట్లు,ఆ తర్వాత కొడుకు పుట్టినట్లు,ఆ పుట్టిన కొడుక్కు ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నాడంట.అసలా వ్యక్తికి పెళ్ళే కాలేదు కానీ ఇన్ని విధాలుగా ఊహించాడన్న మాట.
ఇంకొందరు అసలు ఆ దిశగా  పనులే మొదలు పెట్టకుండా  ఏవేవో  సాధించినట్లు అతిగా ఊహించుకుంటూ వుంటారు.
దీనికి సంబంధించిన ఓ సరదా కథను చూద్దామా...
 "పంకజం పెళ్లి" అని చాలా చాలా ఏళ్ళ క్రితం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి బాలానందం,బాల వినోదం కార్యక్రమంలో వచ్చింది.ఎంతో ఆసక్తిగా సరదాగా నవ్వుకునేలా వుండేది.
ఒక యువకుడు చక్కని అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు.అలా ఓ  ఊరిలోకి ప్రవేశిస్తాడు. పెళ్ళి కావాల్సిన అమ్మాయి పంకజం వాళ్ళ ఇంటికి వెళతాడు.
 ఈ యువకుడు అందంగా వుండి ధనవంతుడు కూడా కావడంతో పంకజం వాళ్ళవైపు అందరికీ బాగా నచ్చుతాడు.
పంకజం కూడా చూడముచ్చటగా వుండటంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు నిర్ణయించుకుంటాడు.
 తల్లిదండ్రులు ఓ కప్పు చాయ్ పట్టుకొని రమ్మని పంకజానికి చెబుతారు.చాయ్ చేయడం కోసం  వంటింట్లోకి వెళ్ళిన పంకజం  ఊహల్లోకి వెళ్ళిపోతోంది.ఆ యువకుడితో తనకు పెళ్ళవుతుంది. ఆ తర్వాత కొడుకు పుడతాడు.వాడికి ఏం పేరు పెట్టాలో అని  ఆలోచిస్తూ అలాగే వంటింట్లో వుండిపోతుంది. ఇంకా రాలేదేమిటా అని తల్లి,ఆ తర్వాత తండ్రి వచ్చి వంటింట్లోనే వుండి పోతారు.వాళ్ళు అలా లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారో చూడటానికి వెళ్తాడు. వాళ్ళు చెప్పిన  మాటలకు,వాళ్ళ ఊహలకు నవ్వుకుని ఇంతకంటే వింత మనుషులు తారసపడితే పంకజాన్నే చేసుకుంటానని అనుకుని బయలుదేరుతాడు.
అలా వెళ్తూ ఊరి పొలిమేరలో గమ్మత్తైన దృశ్యం చూస్తాడు.ఓ మేకల కాపరి తన మేకను చెట్టుపైకి ఎక్కిస్తా వుంటాడు."ఎందుకలా చేస్తున్నావు? అడిగితే మేకలకు ఆకలిగా ఉంది.ఆకులను మేయమని చెట్టు పైకి ఎక్కిస్తూ వుంటే ఒక్కటీ ఎక్కడం లేదు. మా అయ్య ఈయాల నన్ను  వీటిని మేపుకు రమ్మని పంపించాడు" అంటాడు.
అయ్యో! ఇతడెంత అమాయకుడు.తానే చెట్టెక్కి ఆకులు కోసి పోస్తే మేకలన్నీ హాయిగా తినేవి కధా! " అనుకుని అదేమాట అతడితో చెబుతాడు.భలే భలే! మంచి మాట చెప్పారు అనుకుంటూ చెట్టెక్కి ఆకులు కోసి కింద వేస్తే మేకలు కడుపు నిండా తింటాయి.
అలా ఇంకా ముందుకు వెళ్తుంటే ఓ ప్యాంటు  కింద రెండు వైపులా కట్టి ఓ కొమ్మ ఎక్కి దాంట్లోకి దూకబోతూ ,దూకలేక కింద పడుతూ వుంటాడు.అతన్ని  చూసి నవ్వుతూ దానిని ఎలా తొడుక్కోవాలో చెబుతాడు.
 వాళ్ళ కంటే  పంకజమే నయమనుకుని ఆ యువకుడు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు.అదండీ కథ.
ఇది ఓ అమ్మాయి కథ. ఇప్పుడు ఈ న్యాయానికి  సంబంధించిన అసలు సరదా కథ తెలుసుకుందాం.
ఒకతను మట్టి పాత్రలో పేలాల పిండి పెట్టుకుని అమ్మడానికి వెళ్తూ వెళ్తూ, దారిలో ఒక చెట్టు కింద ఆగాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటూ కళ్ళు మూసుకుని ఏవేవో ఊహించుకోసాగాడు.
ఈ పేలాల పిండి అమ్మితే డబ్బు వస్తుంది.దానితో మరింత పిండి చేసి అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది.ఆ డబ్బుతో ఓ గేదెలను కొంటాను.వాటి పాలను అమ్మి బాగా ధనవంతుడను ఐపోతాను.ఆ తర్వాత అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను.పుట్టే కొడుక్కి సోమలింగం అని పేరు పెట్టుకుంటాను.నా వారసుడైన కొడుకు చాలా గొప్ప వాడు.వాడిని నా భార్య కొడితే అస్సలు ఊరుకోను.ఇలా కొడతాను అనుకుంటూ చేయి విదిలిస్తాడు. ఆ విదిలింపు పక్కనే ఉన్న మట్టి పాత్రకు తాకి అది దొర్లుకుంటూ పోయి రాయికి తగిలి ముక్కలు ముక్కలు అవుతుంది. అందులో ఉన్న పేలాల పిండి తేలికగా వుంటుంది కాబట్టి గాలికి ఎగిరి పోతుంది.
ఇలా తాము ఉన్న స్థితిని మరిచి గాలి మేడలు కట్టేవారిని ఉద్దేశించి ఈ "అజాత పుత్ర నామోత్కీర్తన న్యాయము" ను ఉదాహరణగా చెబుతుంటారు.
 మొత్తానికి ఈ న్యాయము పుణ్యమా అని ఓ రెండు సరదా కథలు గుర్తుచేసుకునే అవకాశం. అలా ఊహాగానాలు,గాలిమేడలు కట్టకూడదని తెలుసుకున్నాం కదండీ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు