సుప్రభాత కవిత ; -బృంద
ఆవిరైన ఆశల ముంగిట
ఆశాకిరణంలా
నేలరాలిన ఆకుల స్థానే
కొత్తచివురు కనిపించేలా....

చెమ్మల జడిలో తడిసిన
రెప్పల చీకటి తీసి
కమ్మని కలలకు రూపంగా
రమ్మని స్నేహ హస్తం అందించేలా

వాడిన లేత పువ్వుల
ప్రేమగ తలనిమిరి
ధారగ మమతల ముంచి
జీవం పోసే అనుగ్రహంలా

మాసిన గాయపు మరకల
మూసిన తలపుల వెనుక
మనసెరిగి మర్మంగా మెదిలే
ఆప్యాయపు ఓదార్పులా

తెలియని తుఫాను మధ్యన
ఎరుగని ఆపద పాలైన
చిరుజీవము కాచి
చిరంజీవిగ వరమిచ్చే దైవంలా

సుడిగాలికి చిక్కిన నావకు
చుక్కానిగ ఒడ్డుకు నడిపి
పెక్కు జన్మల పుణ్యఫలమై
దిక్కు తానై నిలిచేలా

ఆగమించు భాస్కరుని చరణాలకు

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు