సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -392
అలాత పిశాచ న్యాయము
******
అలాతము అనగా కొఱవి,కొరివి,సగము తగులబడిన కట్టె.పిశాచము అనగా దయ్యము/ దెయ్యం.
అలాత పిశాచము అనగా కొరివి దయ్యము.కొఱవిని చూసి దయ్యమనుకొనుట.
ఇది అచ్చంగా మూఢనమ్మకాలకు సంబంధించిన న్యాయము.గ్రామాల్లో ఊరి చివర్లో స్మశానాలు వుండేవి.చనిపోయిన వారిని కొందరు సమాధి చేసేవారు అనగా గోతిలో పూడ్చి పెట్టేవారు.మరికొందరు వారి ఆచారం ప్రకారం చితి పేర్చి దహనం చేసేవారు.
రాత్రి పూట ఆ చితిలో కాలుతున్న కట్టెల మంట ఒకోసారి పైకి ఎగిసి కనబడేది.
ఆ దారిలో ఎవరైనా ఊరిలోకి వచ్చేవారికి కానీ ఊరు నుండి వెళ్ళే వారికి గాని కాలే కట్టె మంట ఇంతెత్తున లేచి గాలికి అటూ ఇటూ కదులుతూ ఉంటే అచ్చం ఏదో ఆకారం కదులుతూ వున్నట్లు కనిపించేది. అలా మండే మంటను చూసి దడుచుకుని వాటిని కొరివి దెయ్యాలుగా ఊహించుకునే వారు.
అమావాస్య రోజులు.ఆపైన చిక్కని చీకటి. ఉదయం పూట చూసిన పెద్ద  చెట్ల కొమ్మలు రాత్రి పూట మినుకు మినుకు మినుకుమనే నక్షత్రాల వెలుగులో గాలికి అటూ ఇటూ ఊగుతూ జడల దెయ్యాల్లా కనిపించేవి.
ఉదయం పూట ఎంత పరిచయమున్న దారైనా రాత్రి పూట అటువైపు నడవాలంటే భయపడి పోయేవారు.రాత్రి పూట చెట్ల మీదకి పిశాచాలు వచ్చి చేరుతాయని నమ్మేవారు. 
పైగా చెట్ల కిందకు వెళ్ళిన వారిని ఊపిరి ఆడకుండా చేసి చంపుతాయని కూడా చెప్పేవారు.
అలాంటి అపోహలకు కారణం మనకు తెలుసు. రాత్రి పూట చెట్లు ప్రాణవాయువైన ఆక్సిజన్ విడుదల చేయకుండా కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తాయని. కార్బన్ డై ఆక్సైడ్ వల్ల ప్రాణవాయువు అందక ఊపిరి ఆడదనీ,ఆ చెట్టు కింద నుండి దూరంగా వెళితే మామూలు అయ్యేవారని.
అలాంటి మూఢ నమ్మకమే ఇది కూడా.అయితే నిజంగా కొరివి దెయ్యాలు ఉన్నాయని చితులు గట్రా లేకున్నా  అవి అలా తిరుగుతూ వుంటాయని ఊరిలోని వారు బాగా నమ్మేవారు.పైగా ఎవరి మీద కోపం వస్తే వారిని చంపి తింటాయని కూడా భయపెట్టే వారు.
 అలా మంటలు కనిపించడానికి కారణం ఆయా ప్రాంతాల్లో ఒకే సారి భూగర్భం నుండి సహజ వాయువు నిక్షేపాలు బయట పడి మంటల రూపంలో కనబడేవని శాస్త్రజ్ఞులు చెప్పినా నమ్మేవారు కాదు.
 మన చిన్నప్పుడు ఇంట్లో పిల్లలు ఎవరైనా చెప్పిన మాట విననప్పుడు,ఎక్కడో దూరంగా వెలుతురు చూపి "అదిగో ఆ కనిపించేదే కొరివి దెయ్యం" అని  భయపెట్టే వారు.
అలాగే ఎవరైనా బాగా భయపెట్టే వారిని బాధించే వారిని,మాట మనిషి తీరు భయం గొలిపేలా వున్న వారిని ఉద్దేశించి" అమ్మో వాడా/ ఆమెనా కొరివి దెయ్యం రా" బాబూ! తిట్టుకోవడం కూడా జరిగేది.
అలా ఎవరినైనా భయపెట్టడానికి,తిట్టడానికి తెలుగులో "కొరివి దెయ్యం"అని తిడితే బాగుండదని సంస్కృతంలో  "అలాత పిశాచమనడం పెద్ద వాళ్ళు ఉన్న ఇళ్ళలో చూస్తూ ఉంటాం.
ఇదండీ "అలాత పిశాచ న్యాయము".ఇదో మూఢ నమ్మకమే కాదు.కోపం వేస్తే తిట్టే తిట్టు కూడా. కాబట్టి మనం ఎవరికీ బాధ కలిగించకూడదు.యిబ్బంది పెట్టకూడదు. తెలిసింది కదా! మనల్ని కూడా తెలుగులోనో, సంస్కృతంలోనో అలా తిట్టే ప్రమాదం ఉందండోయ్!.ఎందుకైనా మంచిది జాగ్రత్తగా వుందాం .
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు