సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 అంధ గోక్షేత్ర న్యాయము
*****
అంధ అంటే గుడ్డి. గో అంటే గోవు లేదా ఎద్దు. క్షేత్రము అంటే  పొలము లేదా చేను. "అంధ గోక్షేత్రం" అంటే గుడ్డెద్దు చేనులో పడి తన నోటికి అందినదెల్లా తినడం అని అర్థం.
ఎద్దు గుడ్డిది అయినంత మాత్రాన దానికి ఆకలి లేకుండా ఉంటుందా. అవయవాల్లో లోపాలున్నా ఆకలి అనేది ప్రతి జీవికి ఉంటుంది.
కానీ అది చేలోకే వెళ్ళకూడదు.యజమాని పెట్టిందే తినాలి.అది చేలో పడితే ఏమౌతుంది.దానికి అక్కడ ఉన్నది ఎండుగడ్డా? పచ్చిగడ్డా?పంటచేనా? బీడా? అన్నది తెలియదు. దాని మీద పడి నోటికి ఏది దొరికితే అది తింటుంది.అందుకే  దీనిని "అంధ గోక్షేత్ర న్యాయము" అని అంటారు.
దీనినే మనుషులకు వర్తింప చేసి చూద్దాం.ఇది వ్యక్తుల గుడ్డితనం గురించి చెప్పడం కాదు. వారు ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని తెలియ చెప్పడానికి ఈ న్యాయాన్ని ఉదాహరణగా చెబుతుంటారు.
కొంత మంది తాము చేసేది మంచా? చెడా? తప్పా? ఒప్పా? చేయొచ్చా? చేయకూడదా? ..ఇలా  ఏదీ ఆలోచించరు.అలా నేరుగా వెళ్ళి ఎవరేమనుకున్నా తాను అనుకున్నది చేస్తుంటారు.ఇందులో తన లాభము, సంతోషమే చూసుకుంటారు‌. జరిగే నష్టం గురించి ఆలోచించరు.ఇలా చేయడం  మూర్ఖత్వమే కాకుండా తెలియని తనంగా వివేక శూన్యతగా కూడా చెప్పవచ్చు.
తినాలనే , కడుపు నింపుకోవాలనే ఆశ తప్ప మరొకటి వీరిలో మనకు కనిపించదు.
అందుకే వేమన అలాంటి వారిని గురించి ఇలా అంటారు " ఆశ చేత మనుజులాయువు గల వాళ్ళు/ తిరుగుచుండ్రు భ్రమ త్రిప్ప లేక/ మురికి భాండమందు ముసురు నీగల భంగి/ విశ్వధాభిరామ వినురవేమ!
మురికి కుండలో తిండికోసం ఈగలు ముసురుకొన్నట్లు.ఆయుష్షు ఉన్నన్ని  రోజులు అంటే బతికున్నంత కాలం ఇలాంటి ఆశతో తిరుగుతూ ఉంటారు. భ్రాంతిని వదల లేరు.
ఇలా వ్యక్తులు జీవిత పరమార్థం  మరిచి, ఏది సరైన జీవనం అనే విచక్షణ, వివేకం లేకుండా బతకడం కోసం తోచిందల్లా  చేయడాన్ని అంధ గోక్షేత్ర న్యాయముగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో  🙏

కామెంట్‌లు