సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -386
అతీత మహిషీ స్నేహ న్యాయము
******
అతీత అనగా అతిక్రాంతము,కడచినది.మహిషి అనగా గేదె,బర్రె, ఎనుము. స్నేహ అనగా చెలిమి,చమురు,ప్రేమ, సోపతి, నెయ్యము అనే అర్థాలు ఉన్నాయి.
 అతీత మహిషీ స్నేహము అనగా గడిచిన కాలంలో పెంచిన గేదెను మరవలేకపోవడం అన్న మాట.
ఒక వ్యక్తి గృహస్థ జీవనములో ఉన్నప్పుడు ఒక గేదెను ప్రేమతో పెంచాడు. కొంత కాలం గడిచిన తర్వాత అతడు సన్యాసాశ్రమమును స్వీకరించి తత్త్వోపదేశమును పొందాడు.అయిననూ వెనుకటి బుద్ధి మారలేదు.అతడికి ఎప్పుడూ ఆ గేదె మనసులో మెదులుతూ వుండేదని అర్థము.
అంటే  ఆ వ్యక్తి  తనంత తానుగా సన్యాసం స్వీకరించినప్పటికీ అతడిని పూర్వ వాసనలు వదల లేదు.పూర్తిగా అతని మనసు నియంత్రణ లోకి రాలేదు.పూర్వపు గుణాలు, పూర్వపు పనుల వెంటే మనసు తిరుగుతూ వుందన్న మాట.
 కొంతమంది స్వీయ నియంత్రణ లేని  మనుషులు వుంటారు.మనస్తత్వాలు  వుంటాయనే ఈ అర్థంతో సుమతీ శతక కర్త రాసిన పద్యాన్ని చూద్దామా.
 "కనకపు సింహాసనమున/ శునకము గూర్చుండ బెట్టి శుభ లగ్నమునం/ దొనరగ బట్టము గట్టిన/ వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!"
 
దీని భావం ఏమిటంటే  మంచి ముహూర్తము చూసి ఓ కుక్కను తీసుకుని వచ్చి దానిని బంగారు సింహాసనంపై కూర్చోబెట్టి రాజుగా పట్టాభిషేకం చేసినంత మాత్రాన అది తన సహజ స్వభావాన్ని విడిచి పెడుతుందా ?పెట్టదు కదా!అలాగే హీనమైన మనసును ఉన్నత స్థానంలో వుంచినా  దాని గత స్వభావాన్ని వదలదు. ఒకవేళ నీచ స్వభావం వున్న వ్యక్తిని ఎంత మంచిగా మార్ఛాలన్నా మారడు అని అర్థముతో ఈ న్యాయమును పోల్చి చెప్పడం జరిగింది.
 దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సరదా కథను చూద్దామా....
ఒకానొక వ్యక్తి జీవితమంతా అనేక పాపాలు చేశాడట.ఎంతో మందిని ముంచి ఆస్తిపాస్తులు కూడ బెట్టాడుట. భార్యా పిల్లలు అలా చేయడం మంచిది కాదని ఎన్నిసార్లు చెప్పినా   వినిపించుకోలేదట.పైగా  వాళ్ళనే తన కౄరమైన బుద్ధితో అదుపాజ్ఞలలో వుండేలా చూసుకున్నాడు.ఇకపోతే ఎవరికైనా వృద్ధాప్యం రాక తప్పదు కదా!
ఈ వ్యక్తికి కూడా అలాంటి ముసలి తనం వచ్చింది.ఆ తర్వాత అవసాన దశకు చేరుకున్నాడు.ఎంతైనా తండ్రి/ భర్త  కదా! ఆ చివరి దశలో నారాయణ అనో అందులోని సగం  నారా అని పలికిస్తేనో కొంతైనా పుణ్యం వస్తుంది అనుకొన్నారు. వెంటనే కొంత కొబ్బరి నారను  తెప్పించి దాన్ని  చూపించి నార అని పలికించే ప్రయత్నం చేశారట.ఎన్నిసార్లు చెప్పినా పీచు పీచు అన్నాడే కానీ నారా అని మాత్రం అనలేదట.
అతనిలో పూర్వం అంతో ఇంతో భగవద్భక్తి ఉన్నట్లయితే నారాయణ అని అనే వాడేమో.అతనిలో అలాంటిది  ఈషణ్మాత్రం కూడా లేదు కాబట్టి పలకలేక పోయాడని   అతని గురించి తెలిసిన పెద్దలు అన్నారట.
అంటే పూర్వాశ్రమంలో మనిషిలో అంతో ఇంతో మంచి గుణం,దైవభక్తి ఉంటే తదనుగుణంగా తీసుకున్న తర్వాత చేసే చర్యలో ఆ లక్షణాలు కనిపిస్తాయి.
దీనిని బట్టి  మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది.చాలా వరకు మంచి బుద్ధో చెడు బుద్ధో ఏదైనా సరే చిన్నప్పటి నుంచి వచ్చిన బుద్ది ఒక పట్టాన మారదు. ఒక వేళ మారినట్లు అనిపించినా  కొన్ని కొన్ని సమయాల్లో అసలు బుద్ధి బయట పడుతూనే వుంటుందని  ఈపాటికి అర్థమయ్యే  వుంటుంది.
 ఇలా చాలా మందిలో  గతంలోని  అలవాట్లు కానీ, బుద్దులు కాని అంత త్వరగా  వీడిపోవు.మంచి మార్పు అనేది అంత త్వరగా రాదు అనే అర్థంతో ఈ"అతీత మహిషీ స్నేహ న్యాయము"ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు .
అయితే మంచి వాడు మంచివాడుగా చెడ్డవాడు చెడ్డవాడుగా చెలామణి కావలసిందేనా అనే సందేహం ఎవరికైనా రావచ్చు. వాల్మీకి అంతటి వాడు ఎంతో మారిపోయి మహర్షి అయ్యి  రామాయణం  రాయలేదా?మనమూ అంతే మనస్సును మన అదుపులోకి తెచ్చుకుని గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా "అతీత మహిషీ స్నేహ న్యాయము" నుంచి బయట పడవచ్చు. కావాల్సింది ఆచరణతో కూడిన ప్రయత్నం.అంతే కదండీ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు