తిరుమలరావుకు రామరాజు ట్రస్ట్ పురస్కారం.

 వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు, మరో అరుదైన గౌరవం పొందారు. 
విద్యా, సామాజిక, సాహిత్య, కళా, సేవారంగాల్లో నిరంతరకృషి చేస్తున్నందుకు ఆయనను ప్రశంసిస్తూ, రామరాజు చారిటబుల్ ట్రస్ట్ (పాతపట్నం) అభినందన పురస్కార ప్రదానం చేసింది.
శ్రీకాకుళంజిల్లా, పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ 
ట్రస్ట్ అధినేత పారిశెల్లి రామరాజు నేతృత్వంలో జరిగిన విద్యాసదస్సు వేదికపై తిరుమలరావు సేవలను కొనియాడుతూ పురస్కార ప్రదానం జరిగింది. 
కుదమ గ్రామంలో, అరంజ్యోతి నరసింగరావులనే దంపతులకు 1967లో జన్మించారు కుదమ తిరుమలరావు.
1989లో ఉపాధ్యాయ వృత్తిలో నియమించబడిన ఆయన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే 1999లో జిల్లా స్థాయి, 2005లో రాష్ట్ర స్థాయి, 2009లో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను పొందారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులమీదుగా తిరుమలరావు ఈ జాతీయ పురస్కారాన్ని స్వీకరించారు. 
ప్రభుత్వ పరంగా సెన్సస్-2001 అవార్డు, స్నేహపూర్వక బోధకునిగా రాష్ట్ర అవార్డు, అక్షరక్రాంతి, అక్షరసంక్రాంతి, చదువుల పండుగ, జన్మభూమి, ఆశ పథకం, అమరావతి, ఉగాది, గోదావరి కృష్ణా పుష్కరాల వంటి అవార్డులు వందకు పైబడి పొందారు. హైదరాబాద్ తెలుగు కళావైభవం వారిచే సహస్రకవిమిత్ర బిరుదాంకిత పురస్కారాన్ని స్వీకరించారు తిరుమలరావు. 
తన అనునిత్యసాధనతో కృషిచేసి   ఉపాధ్యాయునిగా, గాయకునిగా, చిత్రకారునిగా, రచయితగా, నటునిగా వందలాది బహుమతులను, సన్మానాలను, అవార్డులను తిరుమలరావు పొందుతున్నారు.
పాతపట్నం గ్రామానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధినేత పారిశెల్లి రామరాజు నేతృత్వంలో పాతపట్నం విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జరిగిన విద్యాసదస్సుకు ఆహ్వానం అందుకున్న తిరుమలరావు, "గురుకులం నుండి కృత్రిమ మేథ వరకు విద్యాబోధనలో గురువు పాత్ర" అనే అంశంపై చర్చాగోష్ఠిలో ప్రసంగించారు. 
రెండుశతాబ్దాల క్రితం ఏడున్నర లక్షల గ్రామాలున్న మన భారతదేశంలో ఏడులక్షల గురుకులాలున్నాయని ఆయన గుర్తుచేసారు. నాటి సాంకేతిక పరిజ్ఞానంలేని రోజుల్లో సైతం అంతరిక్ష పరిశోధనా విద్య, జల్ విద్య, వాయు విద్యల వంటి వందలాది అధ్యయనాలతో కూడిన విజ్ఞానం మన భారతదేశం సొంతమని తిరుమలరావు అన్నారు. బ్రిటిష్ పాఠశాలల, మెకాలే ప్రతిపాదన సిద్ధాంతాల తదుపరి విద్యా విధానాలను ప్రస్తావించారు. 
బొంబాయి, మద్రాసు, కలకత్తా విశ్వవిద్యాలయాల ఏర్పాటు నేపథ్యాలను ఉదహరిస్తూ తిరుమలరావు ప్రసంగం చేసారు. నేటి కంప్యూటర్ విద్యతో పాటు, పుస్తకపఠనం కూడా ఎంతో అవసరమని, దేశ సంస్కృతీ సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ, విలువలతో కూడిన విద్యావిధానాలు మరింత సమకూర్చవలసిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు బాలలహక్కులను పరిరక్షిస్తూ, స్వేచ్చాయుత వాతావరణంలో విద్యా సముపార్జన జరిగేలా వత్తిడిలేని చదువులనందించే దిశగా విద్యాపథకాలుండాలని తిరుమలరావు పిలుపునిచ్చారు. 
చర్చాగోష్ఠి అనంతరం తిరుమలరావును రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అభినందన పురస్కారంతో శాలువా జ్ఞాపికలతో సన్మానించారు. 
తిరుమలరావును సభాధ్యక్షులు, సీనియర్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు చౌధరి రాధాకృష్ణ, ట్రస్ట్ అధినేత పారిశెల్లి రామరాజు, వక్తలు దూసి ఆంధ్రా స్టాలిన్, బినోద్ చంద్ర జెనా, ప్రగడ గణపతిరావు, ఉప్పాడ సూర్యనారాయణ, పి.కూర్మాచార్యులు, జి.రామమోహనరావు, జె.సి.దేవదాస్, మణిపాతృని నాగేశ్వరరావు, ఎం.ధూళికేశ్వరరావు, 
పి.గౌరీశ్వరరావులు ఘనంగా సన్మానించారు.
తనకు లభించిన పురస్కారం పట్ల తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళంజిల్లా కొత్తూరు మండలం కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న తిరుమలరావు, ఇటీవల డెప్యుటేషన్ పై ఈ వోని పాఠశాలకు  బదిలీ కాబడ్డారు. తలవరం సాంఘికశాస్త్ర విషయ సముదాయపు ఎ.పి.ఎస్.ఎస్.టి.ఎఫ్. సహకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 
తిరుమలరావు రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అభినందన పురస్కారం పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తంచేసారు.
కామెంట్‌లు