సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -424
"ఇచ్ఛేష్య మానసమభివ్యాహారే" న్యాయము
******
ఇచ్ఛ అనగా చిత్తము, కాంక్ష. ఏష్య అనగా కాగలది,కోరదగినది,రాదగినది,జరగబోవునది,జరగబోవు దానికి గుఱుతు. మానస అనగా మనస్సుకు సంబంధించినది, మనస్సు నుండి పుట్టినది, మనస్సు, హృదయము,మానస సరోవరము.అభివ్యాహారణము అనగా  మాట లాడుట,పలుకుట అనే అర్థాలు ఉన్నాయి.
ఏదేని యిచ్ఛ లేదా కోరిక జనించుటకు లేదా  పుట్టడానికి కారణం ఆ యిచ్ఛను కలిగించు వస్తువే కారణమగును అని అర్థము.
 అప్పటి వరకూ ఎలాంటి కోరికా,ఆసక్తి లేకుండా మిత్రులతోనో, బంధువులతోనో కలిసి ఓ బంగారం షాపు కాని మరే షాపుకు కానీ వెళ్ళిన వ్యక్తికి అక్కడ వాళ్ళు కొనుగోలు చేస్తున్న వస్తువులను చూసి లేదా  ఆ షాపులో ఏదైనా వస్తువును చూసి కానీ తనకూ కొనుక్కోవాలని కోరిక పుడుతుంది. అంటే  ఆ వస్తువు వ్యక్తిలో కొనాలనే కోరికను కలిగించిందన్న మాట.
అనగా ప్రతి కోరిక వెనుక వస్తువో మరేదో తప్పకుండా వుంటుందనే అర్థంతో ఈ "ఇచ్ఛేశ్య మానసభివ్యాహారే" న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 ఇది చదివినప్పుడు మనిషికి అసలు కోరికలే వుండకూడదని అనిపిస్తుంది ఎవరికైనా సరే.కానీ కోరికలు వుండాలి.కోరికలు లేని మనిషి  ఓ జడ పదార్థం. కాబట్టి కోరికే మానవ మనుగడకు కీలకం అని గుర్తించాలి.
అలా అన్నప్పుడు వెంటనే గౌతమ బుద్ధుడు 'కోరికలు దుఃఖానికి హేతువులు " అన్నారు కదా అనే సందేహం  వస్తుంది.
కానీ గౌతమ బుద్ధుడు ఆ వుద్దేశ్యంతో అనలేదనేది గుర్తు పెట్టుకోవాలి.బుద్ధుని దృష్టిలో  కోరికలు ఉన్నా అవి దుఃఖానికి కారణం కాకూడదు అని.వాటిని సముద్రంలోని అలల వలె గుర్తించాలి కానీ ప్రతి అల తీరం చేరాలనే ఆరాటపడే కోరికే తప్పు అని అర్థం.
ఏ కోరిక తీరగలదో,దాని గురించి మనం ఏం చేయగలమో అందులో నిమగ్నం అయితే,ఆ అవగాహన పెంచుకుంటే కోరికల వలన ఎలాంటి బాధ, దుఃఖం వుండదు.
"కోరికలూ,ఆశలతో పోరాటానికి ప్రయత్నించ వద్దు". అంటారు  సద్గురు.
 ఎందుకంటే  ఎంత ఎక్కువగా పోరాడితే అంత ఎక్కువగా వస్తాయి అంటారు.
పురాణాలలో చెప్పినట్లు కోరిక రక్త బీజుడి లాంటిది. దానిని బలవంతంగా నరికేస్తే అందులోంచి చిందిన రక్తం ఎన్ని చుక్కలు అవుతుందో  అన్ని కోరికలు మళ్ళీ పుడతాయి.ఒక్కో రక్తపు బొట్టు లాంటి  కోరికకు వెయ్యి కోరికలు ఆశలు ఉద్భవిస్తాయన్న మాట.
 ఇలా కోరికలు కోరుకోకుండా వుండాలనే కోరికతో చేసే యుద్ధం మరిన్ని కోరికలు పుట్టడానికి కారణం అవుతుంది.
కాబట్టి కోరికలను, ఆశలను ఉత్తమమైన ఆశయాల సాధన వైపు మరల్చాలి. అప్పుడే అవి నెరవేరే మార్గాలు సుగమం అవుతాయి.
 ఇదండీ! కోరికల పుట్టుక. వాటి ఉపసంహరణ. ఇవి రెండూ తెలుసుకోగలిగితే, వాటిని ఆచరణలో పెట్టగలిగితే మన జీవితం సంతృప్తిగా, ఆశయాలకు అనుగుణంగా నడుస్తుంది. సమాజానికి మేలు కలుగుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు