మృత్యోర్మా అమృతంగమయ- సి.హెచ్.ప్రతాప్
 ఓం అసతోమా సద్గమయ,
తమసోమా జ్యోతిర్గమయ,
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతి: శాంతి: శాంతి:
ఓ దేవా ! అసత్యము నుంచి సత్యానికి నన్ను నడిపించు. చీకటినుంచి వెలుగు లోకి నడిపించు. మృత్యువు నుంచి అమృత తత్వానికి (శాశ్వతత్వం వైపుకి) నన్ను నడిపించు దేవా అని పై శ్లోకానికి అర్ధం.సత్యమే భగవంతుడు ఈ జగమంతా మాయే అసత్యం లేదా మిధ్య. భగవంతుడు శాశ్వతముగా వుంటాడు. ఈ ప్రపంచము అశాశ్వతము ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. శాశ్వతమైన భగవంతుని వైపు నన్ను నడిపించు అని పైల్ శ్లోకం ద్వారా ఆ సర్వేశ్వరుడిని అందరం ప్రార్ధిస్తాం.మృతం లేనిది అమృతం. అనగా క్షరం కానిది. నాశనం లేనిది. జీవితాన్ని ప్రసాదించేది. మృత్యోర్మా అమృతంగమయ అనేది బోధ. మృత్యువు నుండి అమృతతత్వానికి చేరడమే ఆధ్యాత్మిక తత్వం.ప్రాచీన ఉపనిషత్ కాలం ఋషులు అద్భుతమయిన ప్రార్థన చేశారు. ప్రపంచంలోని అద్భుత ప్రార్థన అది. ‘తమసోమా జ్యోతిర్గమ’ దేవా చీకటి నించీ నన్ను కాంతిలోకి నడిపించు, అసతోమా సద్గమయ అసత్యం నించీ సత్యానికి నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ మరణం నించీ మరణ రాహిత్యానికి నడిపించు. వేల సంవత్సరాల క్రితందయినా యిప్పటికి ఎంతో విలువైంది.  
108 సంఖ్యను అమృతతత్వానికి చిహ్నంగా వివరిస్తారు. సముద్ర మథనం చేసే సమయంలో 54 మంది దేవతలు, 54 మంది రాక్షసులు పాల్గొని, పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని బయటకు తీశారు. ఇలా అమృతాన్ని బయటకు తీయడంలో 54 మంది దేవతలు, 54 మంది రాక్షసులు మొత్తం 108 మంది కలిసి కృషి చేశారు. అందుకే 108కి అమృతతత్వం ఉందని మన పురాణాల్లో వివరించారు.

కామెంట్‌లు