సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -417
అరణ్య రుదిత న్యాయము
****
అరణ్యము అంటే అడవి. రుదితము అంటే రోదనము,ఏడుపు అనే అర్థాలు ఉన్నాయి.
అరణ్య రోదనము అంటే అడవిలో ఏడవడం.అసలే అడవి.ఆ  అడవిలోకి వెళ్ళి ఏడ్చినా, మొత్తుకున్నా ఎవరు వింటారు? వినేందుకు ఎవరూ వుండరు.అయ్యో! అని కష్టం, నష్టం అడిగి తెలుసుకుని ఆదరించి, ఓదార్చే వారు అసలే ఉండరు.
 అసలు అడవికి పోవడం ఎందుకు? అక్కడికి వెళ్ళి ఏడవడం ఎందుకు? ఎవరూ పట్టించుకోవడం లేదని బాధ పడటం ఎందుకు? ఈ ప్రశ్నలు  ఈ న్యాయము చదివే వారందరిలో ఉదయిస్తాయి.
అయితే మన పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాట, సామెత, జాతీయం వెనుక  నీతితో కూడిన నిగూఢమైన అర్థం వుంటుందని మనకు తెలుసు.
 అరణ్య రోదన అనే పదబంధం యొక్క శబ్దార్థము అరణ్యంలో ఏడుపని, అక్కడ ఎవ్వరూ పట్టించుకోరని.
మరి మనం చూడాల్సింది, అర్థం  చేసుకోవలసింది ఇది కాదు. ఈ పదబంధం యొక్క భావార్థము.
కొంతమంది కళ్ళముందు  ఇతరులు రకరకాల బాధలు పడుతున్నా అస్సలు పట్టించుకోరు. సాటి మనిషి లేదా ఇరుగు పొరుగు కదా! ఏమైందో? ఏమో? అనే కనీస సానుభూతైనా  చూపరు.అలాంటి  సందర్భాల్లో  ఆ బాధ పడే వ్యక్తుల ఆవేదనకు, రోదనకు ఈ న్యాయము కొంత వర్తిస్తుంది.
అందుకే కవి అలిశెట్టీ ప్రభాకర్ గారు తన "నగర గీతం" కవితలో ఇలా అంటారు ' "నగరమనే మహా వృక్షంపై ఎవరికి వారే ఏకాకి", "నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే/మరి బతుకు పేజీలు తిరగేసేదెవరో? అని.
అంటే ప్రతి మనిషి  ఒంటరే.అతడి దుఃఖం,బాధ, కష్టం, నష్టం ,సుఖం ఎవరికీ పట్టదు. అతడికెలాంటి యిబ్బంది వచ్చినా పట్టించుకునే వారెవరూ ఉండరు.అలాంటప్పుడు అతడి రోదన "అరణ్య రోదనే "అని అర్థము.
 అదే కాదు నేటి యువత పోకడ చూసి పెద్దలు చాలా  బాధ పడుతున్నారు. వారి భవిత ఏమై పోతుందోనని దుఃఖిస్తున్నారు .మంచి మాటలు చెప్పి సరియైన మార్గములో నడిపించాలనే వారి ఆరాటం,తపన "అరణ్య రోదనే" అవుతోంది.నేటి యువతీ యువకుల్లో  చాలా మంది పెద్దలు చెబితే వినే పరిస్థితిలో అసలు లేరు.చరవాణి, అంతర్జాల మాధ్యమాల ఊబిలో చిక్కుకుని తమ అందమైన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.
 అలా అడవి లాంటి మనసులు,మనుషులు ఉన్నంత కాలం ఎవరు ఏడ్చినా, మొత్తుకున్నా, ఎంతగా తమ వారికై శ్రమించినా,ప్రేమించినా,తిట్టినా, ప్రశంసించినా, ప్రాణంగా చూసుకున్నా ఫలితం అంతా శూన్యమే.శూన్యం నుంచి ఎలాంటి ప్రతి స్పందన వుండదనేది తెలుసు కదా!(  శూన్యంలో ధ్వని ప్రసారమనేది జరగదు).
 ఇంతెందుకండీ! ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.మన మాతృ భాష అయిన తెలుగు  గురించే మాట్లాడుకుందాం.
తెలుగు భాష మృత భాష కాబోతోంది.తెలుగు మాట్లాడే వారు తెలుగును మాట్లాడటానికి ఇష్టపడటం లేదు.నేటి తరం  ఆంగ్ల మాధ్యమ చదువులపై విపరీతమైన మోజును పెంచుకోవడం చూస్తున్నాం.మరి భాషా వేత్తలేమో  ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తెలుగు భాష కనుమరుగు కావడం తథ్యమని బాధ పడుతున్నారు. మాతృభాషలో విద్యాబోధన జరగాలని, భాషను ఎలాగైనా కాపాడుకోవాలని హెచ్చరిస్తున్నారు.కానీ వారి హెచ్చరిక,బాధ నేడు "అరణ్య రోదనే" అవుతోంది.
కవులు, రచయితలు, భాషాభిమానులు, భాషా వేత్తలు తప్ప మిగతా వారెవ్వరూ  ఈ విషయం పట్టించుకోక పోవడం చూస్తున్నాం.
 ఇలా వివిధ సందర్భాలలోని పరిస్థితులకు ఈ "అరణ్య రుదిత న్యాయము"ను అన్వయించి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 మనమైతే  తెలుగు భాష పరిరక్షణకు పాటు పడదాం. మన బాధ అరణ్య రోదన కాకుండా. అవసరమైన రోదనేనని అర్థమయ్యేలా చెప్పి, మన మాతృభాష రక్షణకై అందరం కలిసి కట్టుగా కృషి చేద్దాం. కృష్ణ దేవరాయల కాలం నాటి వైభవాన్ని మళ్ళీ తీసుకుని వద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు