స్వ ధర్మాచరణ;-సి.హెచ్.ప్రతాప్
 గుణరహితమైనా ,కష్ట సాధ్యమైనా స్వధర్మాచరణయే అన్నింటి కంటే మేలైనది. పర ధర్మాచరణ మానవుని వినాశనానికి దారి తీస్తుంది. సమాజం లో అశాంతి, అలజడులు, అసమానతలు నెలకొనడం ఖాయం. జన్మత: ,వృత్తి వలన ప్రాప్తించిన స్వధర్మాన్ని విడవడం, పరధర్మాన్ని ఆచరించడం ఎంత మాత్రం తగదు. స్వధర్మం ఆచరించిన ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి మొదలైన వారు చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. మాకు ఒక మతం వలన మేలు కావడం లేదని ఇతర మతములను ఆశ్రయించేవారు ఈ విషయం లో సక్రమం గా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. జన్మత: సంక్రమించిన మతం పితృ సమానం. జన్మ నిచ్చిన తండ్రిని మార్చడం ఎంత పాపభూయిష్టమో మత మర్పిడి కూడా అంతే. దాని వలన బ్రహ్మ హత్యా పాతకం వంటి భయం కరమైన దోషాలు సంక్రమించడం తో పాటు రౌద్రవాది నరకముల ప్రాప్తి తప్పదు. అందుకే స్వధర్మాచరణే మిక్కిలి శ్రేష్టం.
నారాయణ మంత్రం భయంకరమైన సంసార విషాన్ని హరిస్తుందని నారసింహ పురాణ వచనం. అనన్య భక్తితో భగవంతుని భజించడమే భక్తి యోగం. మన మనసును భగవంతునియందు మేళవింపజేయడమే ప్రార్థన. పవిత్రమైన మనసుతో చేసే ప్రార్థనను దేవుడు అవశ్యం వింటాడు అని మన వేదాలు ఘంటాపధంగా చెబుతున్నాయి.
ఒక పండితుడు రామాయణ ఉపన్యాసం చెబుతూ, “రాముడు సాక్షాత్ మనవావతారం.. మనుష్యుడిగానే పుట్టాడు.. మనుష్యుడిగానే పెరిగాడు.. మరి జటాయువుకు మోక్షాన్ని ఎలా ఇవ్వగలిగాడు అంటే అది కేవలం స్వధర్మాచరణ వల్ల మాత్రమే సాధ్యపడింది” అని చెప్పారు.
ధర్మాచరణకు ప్రతిరూపం శ్రీరామచంద్రుడు. క్షత్రియధర్మమును గౌరవముతో పాలించువాడు. ధర్మమునకు, సత్పురుష్లకు, ఆపద కలిగినప్పుడు, దానిని ఎదిరించి తొలగించుట దుష్టులను, అధర్మమును నిగ్రహించుట ప్రజాపాలకుడగు క్షత్రియునకు స్వధర్మము. దానిని ఆయన గౌరవముతో పాలించువాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అయి ఉండియూ దానిని ప్రదర్శించుట కంటే తాను పుట్టిన కులమగు ఇక్ష్వాకువంశపు ధర్మము  ఆచరించుటయే గొప్ప అని భావించువాడు. అందుకే శ్రీరామచంద్రమూర్తి లోకవిఖ్యాతి గాంచాడు.
మార్గశిర శుద్ధేకాదశి *శ్రీమద్భగవద్గీత లోకానికి అందినరోజు.  సాక్షాత్ భగవత్స్వరూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా,  సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఇందులో భగవానుడు చెప్పాడు. అది కఠోర  తపస్సు చేసుకునే వాళ్ళకే కాకుండా, సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతీ ఒక్కరికీ కర్మయోగం, భక్తియోగం, నిష్కామ కర్మలు ఎలా ఆచరించాలి, కర్తవ్యాన్ని విస్మరించకుండానే భగవంతుని చేరే మార్గం, స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత, పరధర్మానుష్టానం వల్ల కలిగే విపత్తులు వంటివెన్నో శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ తెలియచెప్పాడు. 
కామెంట్‌లు