సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-444
కర్ణ  కౌంతేయ న్యాయము
****
కర్ణః అనగా చెవి, చుక్కాని, కన్నము,కుంతి మొదటి కుమారుడు. కౌంతేయుడు అనగా కుంతీ కుమారుడు.
కర్ణుడు కుంతీ పుత్రుడు అయిననూ ,ఆ విషయం తెలియనంత వరకు అతడు రాధేయుడనే పిలువబడ్డాడు. శ్రీకృష్ణుడు, కుంతీ జన్మ రహస్యం చెప్పిన తర్వాత వాస్తవం తెలిసింది.అలా తెలిసిన తర్వాత నుంచి కర్ణుడిని కుంతీ పుత్రుడు/ కౌంతేయుడుగా  పిలిచారు.
అనగా వాస్తవానికి, అవాస్తవనికి మధ్య జరిగేవి ఎలా వుంటాయో చెప్పడమే ఈ న్యాయము లోని అంతరార్థం.
ఇది తెలుసుకునే ముందు కర్ణుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
 మహాభారత ఇతిహాసములో కర్ణుడు ఒక వీరుడు.ఇతడు కౌంతేయుడు అని పిలిపించుకునే ముందు రాధేయుడుగా గుర్తింపు 6/పొందాడు. రాధేయుడు అంటే రాధ కుమారుడు. రాధ కర్ణుని పెంపుడు తల్లి.
కుంతి కన్యగా వున్నప్పుడు సూర్యుడి  వర ప్రసాదంతో కర్ణుడు జన్మిస్తాడు.కన్యగా పొందిన సంతానం వల్ల తనకు అపకీర్తి వస్తుందనే భయంతో ఆ శిశువును ఒక పెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేసి వెళ్లిపోతుంది. సూత వంశీయుడైన అతిరథుడి భార్య రాధకు ఆ పెట్టె దొరుకుతుంది. సంతానం లేని ఆ దంపతులు పెట్టెలో వున్న బాలకుడిని పెంచుకుంటారు.అలా రాధ పెంచడం వల్ల కర్ణుడు రాధేయుడిగా పిలవబడ్డాడు.
అయితే కర్ణుడు కుంతీ పుత్రుడు అనే విషయం కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులకు తెలుస్తుంది.పాండవులు యుద్ధంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో రాధేయుడైన కర్ణుని గురించి కుంతీ పుత్రుడు అని తెలుస్తుంది.అంత వరకు కూడా కర్ణుడు సూత పుత్రుడిగా ఎన్నో రకాల అవమానాలు పొందుతాడు.
అయితే ఇక్కడ ఈ న్యాయాన్ని ఉటంకించడానికి కారణం అది కాదు.కర్ణుడు రాధేయుడిగా పిలవబడ్డాడా?కౌంతేయుడుగా చివర్లో నైనా గుర్తింప బడ్డాడా? అని కాదు.కర్ణుడు మొదట కుంతీ కుమారుడే‌. అనేకానేక కారణాల వల్ల చనిపోయేంత వరకు కూడా  అసలైన తానెవరో తెలియకుండానే జీవితాన్ని ముగించాల్సి వచ్చింది.
మన పూర్వీకులు, పెద్దలు దీనిని ఎలా అన్వయించారో చూద్దాం.అందరం మనుషులమే అందులో ఎలాంటి సందేహమూ లేదు.
అన్ని జీవుల నుండి మనిషి ప్రత్యేకంగా వేరు చేయబడటానికి కారణం.మనిషిలోని జ్ఞానం.మరి ఈ జ్ఞానం ఏం చేస్తుంది? చావు పుట్టుకల పరమార్థం ఆలోచించేలా చేస్తుంది. బతికినంత కాలం ఎలా బతకాలో చెబుతుంది. మొత్తంగా జ్ఞానం మనిషిని మనీషిగా వుండమని ,అలాంటి జీవితం గడపాలని చెబుతుంది.
నాది, నా వాళ్ళు, నా సంపాదన అంటూ స్వార్థంతో బతకడం కాదు. అందులోంచి బయటకు వచ్చి మనిషిగా ఎలా బతకాలో మనకు జ్ఞానం వల్లనే తెలుస్తుంది. అలాంటి జ్ఞాన సముపార్జన చేసినప్పుడే మనిషిగా మనమేమిటో వాస్తవమైన జీవితం అంటే ఏమిటో  తెలుస్తుంది.
అవాస్తవాలైన ఐహికమైన  సుఖాలు,ఆశల కంటే  విలువల జీవితం ఎంత వాస్తవమో దాని వల్ల మనం ఎలా చిరంజీవులం కాగలమో ఈ " కర్ణ కౌంతేయ న్యాయం "ద్వారా  గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు