సుప్రభాత కవిత ; - బృంద
పారిపోయిన చీకటిలో
కలిసిపోయిన కలతలు
కదిలి వచ్చే వెలుగులో
మెదిలెనెన్నో కోరికలు

తప్పిపోయిన తలపులేవో
తట్టిలేపిన జ్ఞాపకాలు
తలచుకుని మురిసి
తడిసిపోయిన ఎడదలు

తీరిపోయిన ఋణాలేవో
చేరిపోయిన తీరాలు
కోరుకున్న కలలన్నీ
కరిగిపోయిన  గుర్తులు

మారిపోయిన కాలమేదో
మరలివచ్చి మురిపించేనని
ఎండిపోయిన ఎదలో ఏదో
తడి తగిలిన భావనలు

జారిపోయిన క్షణాలన్నీ
ఏరి ఏరి దాచుకుంటూ
కారుతున్న కన్నీటిలో
చేరుతున్న గుండె బరువులు

నలుగుతున్న మనసుకేదో
నచ్చినట్టు జరిగేలా
కొదవలన్నీ  వదిలిపోయే
వరమేదో తెస్తున్న వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు