జలతారు పోగులు ; - కేశరాజు వేంకట ప్రభాకర్ రావు -పాతర్లపాడు, ఖమ్మం.-సెల్ ఫోన్. ‌.. 62816 97982
 మేఘాల అంచుల్లో 
త్యాగాల జలసంపద... ఇది 
రాగాల సందుకనెత్తుకొని 
భోగాల జల్లులతో మహి నెంతో మురిపించు !!

జలతారు పోగులతో 
మిల మిల మెరుపులతో
గలగల జారుతు గగనం నుంచి 
కిల కిలా నవ్వుతూ కిన్నెరసానై ప్రవహించి!!

వెలతెలా పోయిన 
చెలకల నిండా పారి 
మొలకలకు మోదం గొలిపి
కలతలకు కాలం చెల్లిందని చెప్పి!!

కలిమికి బార్లా తలుపులు తెరిచి 
బలిమితో బాహాటంగా బాసటగా నిలిచి 
చెలిమితో చేయూత నిచ్చే మనిషిగా మలిచి 
అలమటించు వారి పట్ల ఆత్మబంధువుగా నిలుపు !!

మేఘాల అంచులు, దాచిన 
పూదేనియ సంచులు ,
బాధలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకొని 
సాచివ్యముతో సముద్దరించే సద్గుణులు!!

అందుకే!వాటిని చూడగానే 
ఊహలకు రెక్కలొచ్చి, దేహానికి చేవ పెరిగి,
ఉర్వి నుంచి ఉన్న పళంగా ఎగిరి 
ఉయ్యాల ఊగాలని ఉంది ,వాటిని పట్టుకొని !!
కామెంట్‌లు