సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు-461
కుసూల ధాన్య న్యాయము
******
కుసూల అంటే ధాన్యము నిలువ వుంచే గది,ధాన్యం నిలువ చేసే పాతర లేదా ధాన్యపు గుమ్మి.ధాన్య అంటే ధాన్యము ,నవ ధాన్యాలలో ఏవైనా.
గాదెలో నుండి కొంచెము కొంచెముగా తీస్తూ వుంటే క్రమంగా అందులో ఉన్న ధాన్యమంతా తగ్గిపోతుంది.అనగా "కూర్చుని తింటే కొండలైనా కరిగి లేదా తరిగిపోతాయి" అనే అర్థంతో ఈ "కుసూల ధాన్య న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
అంటే ఒళ్ళు వంచి కష్టపడకుండా తాతలు తండ్రులు నుండి సంక్రమించిన ఆస్తులను ఖర్చు పెడుతూ, జీవితం గడుపుతూ వుంటే. అవి ఎంతో కాలం మిగలవు అని అర్థము.
 పల్లెల్లో ఎక్కువగా ఈ సామెతను వాడుతారు.సూక్తిగా కూడా చెబుతారు.
చాలా కుటుంబాల్లో ఒక తరం రెక్కలు ముక్కలు చేసుకుని చీమ కూడబెట్టినట్టు ఆస్తులు పోగేస్తుఃది. ఇక మరో తరం కష్టమన్నది తెలియక సంపాదనంతా  రకరకాల పందాలకు ,జల్సాలకు ఖర్చు పెడుతుంది. అలా మన కళ్ళ ముందే కొన్ని కుటుంబాలు ఒకప్పుడు బాగా బతికి తర్వాత తరానికి వచ్చేటప్పటికి కటిక దరిద్రం అనుభవించడం చూస్తుంటాం.
 ఓ రచయిత  కాస్త  హాస్యం, ఇంకాస్త హెచ్చరిక మేళవించి"కూర్చుని తింటే కొండలే కాదు కుండలూ తరుగుతాయి.కండలూ పెరుగుతాయి." అంటాడు. అంటే ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా రెండు రకాలుగా నష్టాలే అని అర్థము.
కండలు పెరగడం అంటే శరీరంలో కొవ్వు శాతం పెరగడం.అందువల్ల అనేక రకాల అనారోగ్యాలు ఒంట్లో వచ్చి చేరుతాయి.ఊబకాయం,పొట్ట పెరగడం, మోకాళ్ళ నొప్పులు రావడం,గుండె సంబంధిత వ్యాధులు రావడం జరుగుతుంది.అంటే ఆరోగ్యం అనే ఆస్తి తరుగుతుందని చెప్పుకోవచ్చు.
నేటి మానవ జీవన విధానం చాలా మార్పులకు లోనైంది.సాంకేతిక విజ్ఞానం, అధునాతన సౌకర్యాలు మనిషికి శారీరకంగా కష్టపడే అవకాశం కలిగించడం లేదు.
చేతిలో ఓ రిమోట్ వుంటే చాలు.దేనినైనా చిటికెలో చేయగలం.నేటి సాంకేతిక పరిజ్ఞానం సెన్సర్ల ద్వారా పని చేయించుకునేంత వరకు ఎదిగిపోయింది.
అందువల్ల మనిషికి మానసిక శ్రమ తప్ప శారీరక శ్రమ ఉండటం లేదు.
ముఖ్యంగా ఈ ""కుసూల ధాన్య  న్యాయము" గురించిన ప్రస్తావన మధ్య తరగతి కుటుంబాలలో  వస్తుంటుంది.
తాతనో, తండ్రినో అతి కష్టమ్మీద పొదుపు చేసి  స్థల రూపేణనో, డబ్బు రూపేణనో కొద్దోగొప్పో సంపాదించి పెడతాడు. అలాంటి ఇళ్ళలో ఏ ఒక్కరు సోమరిగా వున్నా సంపాదించిన వాటికి రెక్కలు వస్తాయి.అంటే ఏదో ఒక అవసరానికి ఖర్చు పెట్టడమో,అమ్మడమో చేయాల్సి వస్తుంది.
గతంలో పెద్దలు సంపాదించినవి కష్టార్జితాలు. మోసార్జితాలు కావు అనేది గుర్తుంచుకోవాలి.
కాబట్టి ఉన్నదాన్ని కాపాడుకోవాలి.లేని వాటి మీద మోజు పడకూడదు.
దీనికి సంబంధించిన సరదా కథ ఒకటి చూద్దాం.
ఓ ఇంట్లో ఓ యువకుడు ఏ పనీ చేయకుండా సోమరిగా  తిరుగుతూ వుంటాడు.తినడం తిరగడం తప్ప ఏ పనీ చేయడు.దాంతో ఇంట్లో వాళ్ళకు అసహనం, కోపం పెరిగి పోతుంది."కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని" మందలిస్తొరు.
అతడా మాటలకూ కొంచెమైనా మారాలి కదా! అలా కాకుండా నిలబడి అటూ ఇటూ తిరుగుతూ తినడం మొదలు పెడతాడు. అది చూసి "ఏంటలా చేస్తున్నావు?అడిగితే "కూర్చుని  తింటే కొండలు కరుగుతాయని మీరే చెప్పారు" కాబట్టి నిలబడి తింటున్నా!" అంటాడు.  దీనిని బట్టి వాడు మూర్ఖుడా! అతి తెలివి కలవాడా? అనేది మనం అర్థం చేసుకోవచ్చు.
 
,"కుసూల ధాన్య న్యాయము"వలె కాకుండా కష్టించి పని చేసి సంతోషపడదాం-మన వాళ్ళను సంతోష పెడదాం.. మరి మీరేమంటారు?
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు