న్యాయాలు -484
గలే పాదుకా న్యాయము
*****
గలే అనగా గొంతుకలో, కుత్తుకలో,మెడలో. పాదుకా అంటే చెప్పు, పాదరక్ష అనే అర్థాలు ఉన్నాయి.
ఎవడైనా మెడలో చెప్పు కట్టుకొనునా? చెప్పుల దండ వేసుకొంటాడా? అని అర్థము.
ఎవరూ తమంత తాము చెప్పుల దండ మెడలో వేసుకోరు. చెప్పుల దండ మెడలో పడింది అంటే ఆ వ్యక్తి అత్యంత హీనంగా అవమానానికి గురవడం అన్న మాట.
ఎవరైనా వ్యక్తి మెడలో చెప్పుల దండ వేయడం అంటే అత్యంత తీవ్రంగా అవమానించడం. వేసిన వారి భయంకరమైన ఆధిపత్యానికి,కౄరత్వానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.
పూర్వ కాలంలో ఎవరైనా దొంగతనం చేసి పట్టుబడితే ఆ దొంగకు దేహశుద్ధి చేసి ఆ తర్వాత అతడి మెడలో చెప్ఫుల దండ వేసి, సగం గుండు చేసి,సున్నం బొట్లు రాసి,గాడిద మీద కూర్చోబెట్టి ఊరు ఊరంతా ఊరేగించే వారు.
అలాంటి శిక్షను చూసిన తర్వాత చోర గుణం కలిగిన వారు ఎవరైనా సరే మరోసారి దొంగతనం జీవితంలో చేసేవారు కాదు.
భారతీయ శిక్షా స్మృతి ప్రకారం అలా చేయడమనేది చాలా హేయమైన చర్య.దొంగతనం,దోపిడీ కంటే భయంకరమైన హత్య, అత్యాచారం లాంటివి చేసిన వారికి కూడా నేడు ఇలాంటి శిక్షలు వేయడం లేదు.
పూర్వం పల్లెటూళ్ళలో భూస్వాములు, ఆధిపత్య వర్గాల పెత్తనం వుండేది. బడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళ ఇంటి ముందు నడిచేటప్పుడు చెప్పులు వేసుకోవడం కూడా నేరంగా పరిగణించే వారు.వాళ్ళ గడీలు దాటేంతవరకు చెప్పులు చేతపట్టుకొని తలవంచుకుని నడిచి వెళ్ళేవారు.
అయితే అది ఒకప్పటి మాట.కానీ నేటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో చట్టం అనేది అంగబలం, అర్థబలం ఉన్న వ్యక్తుల చేతుల్లో ఉండటం చూస్తున్నాం .పత్రికల్లో చదువుతున్నాం. టీవీల్లో చూస్తున్నాం.
ఇంకా ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే రాజకీయాల్లోకి చనిపోయిన వారి విగ్రహాలను లాగి వారి మెడలో చెప్పుల దండ వేసి తమ విద్వేషాన్ని ప్రదర్శించడం జరుగుతోంది.
ఈ మధ్య ఓ పత్రికలో వచ్చిన వార్త చూసి నివ్వెర పోవాల్సి వచ్చింది.జులాయిగా తిరుగుతూ తల్లిదండ్రులు ఆస్తి పంచి ఇవ్వలేదని వారి ఫోటోకు చెప్పుల దండ వేసిన ప్రబుద్ధుడు.
ఇలా కౄరంగా నీచంగా విలువలు మరిచి పోయి పాదాలకు వేసుకునే చెప్పులను మెళ్ళో వేసి అవమానించడం చూస్తుంటే వీళ్ళు మనుషులా? అనిపిస్తుంది.ఇలాంటి అమానవీయ ప్రపంచంలో మనమూ ఉన్నందుకు ఎంతో బాధగా, సిగ్గుగా అనిపిస్తుంది.
మొత్తంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే "గలే పాదుకా న్యాయము" అనేది ఒక అమానవీయ చర్యకు ప్రతిరూపం.అలా చేయకూడదు.చేసిన వారిని ఉపేక్షించకుండా తప్పకుండా శిక్షిఃచాల్సిన అవసరం ఉంది.
కొస మెరుపు ఏమిటంటే మన దేశంలోనే ఓ రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల గుర్తు "చెప్పు(పాదరక్ష)" అట.అందుకే ఏడు చెప్పులను దండగా చేసి మెళ్ళో వేసుకుని వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడనే వార్త చదివిన తరువాత "వెర్రి వేయి విధాలు" అనే సామెత గుర్తుకు వచ్చింది.
ఆనాడు అయోధ్యకు రాజు కావాల్సిన శ్రీరాముడు పినతల్లి కైకేయి కోరికతో తండ్రి మాట నిలబెట్టడానికి పద్నాలుగేళ్ల వనవాసానికి అడవికి వెళితే, విషయం తెలుసుకున్న భరతుడు అన్న రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి ఎంతో విధేయతతో పరిపాలన చేశాడు. అది అన్నదమ్ముల అన్యోన్యతకు,గౌరవానికి ప్రతీక.
కానీ చెప్పులను మెడలో వేయడం, వేసుకోవడం అగౌరవం, అమానవీయతకు నిదర్శనం. అలాంటి సంఘటనలను ఖండిద్దాం. అమానుష చర్యలు జరగకుండా చూద్దాం."గలే పాదుకా న్యాయము"లోని అన్యాయాన్ని నిరసిద్దాం.అలాంటి చర్యలను ఖండిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి